సాక్షి, నల్లగొండ: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదన్న చందంగా ఉంది జిల్లా అధికార యంత్రాంగం తీరు. గ్రామీణులకు వైద్య సేవలు అందించేందుకు మంజూరు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) నిర్మాణం అతీగతీ లేదు. స్థల సేకరణలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. పెరిగిన జనాభా దృష్ట్యా ప్రజలకు వైద్యసేవలు మరింత దగ్గర చే సేందుకు జిల్లాకు 13వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా గతేడాది నాలుగు పీహెచ్‌సీలు మంజూరయ్యాయి.
నల్లగొండ మండలం రాములబండ, చౌటుప్పల్ మండలం తంగడపల్లి, దేవరకొండ మండలం బొడ్డుపల్లి, దామరచర్ల మండలం అడవిదేవులపల్లికి ఒక్కో పీహెచ్‌సీ చొప్పున ప్రభుత్వం మంజూరు చే సింది. భవన నిర్మాణంతోపాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఒక్కో పీహెచ్‌సీ నిర్మాణానికి రూ.78.15 లక్షల చొప్పున నాలుగింటి కోసం రూ.3.12 కోట్లు అవసరం అవుతాయని అంచనాలు రూపొందించారు. నిర్మాణానికి టెండర్లు కూడా ఖరారయ్యాయి. కాంట్రాక్టర్లతో రూ.1.63 కోట్లకు ఒప్పందం కూడా కుదిరింది.
ఇదీ పరిస్థితి...
పీహెచ్‌సీల నిర్మాణానికి స్థలం కావాలని వైద్య, ఆరోగ్య శాఖాధికారులు కలెక్టర్‌కు గతంలో ప్రతిపాదనలు పంపారు. వీలైనంత త్వరలో స్థలసేకరణ చేయాలని సంబంధిత తహసీల్దార్లకు కలెక్టర్ సూచించారు. ఇటీవల మూడు చోట్ల స్థలం లభించినట్లు అధికారులు చెబుతున్నా దాన్ని ఇంతవరకు కాంట్రాక్టర్‌కు అప్పగించలేదు. తంగడపల్లి పీహెచ్‌సీ నిర్మాణానికి ఈఏడాది ఫిబ్రవరిలో ఒప్పందం కుదరగా.. ఈనెల 10వ తేదీలోగా నిర్మాణం పూర్తికావాల్సి ఉంది.
కానీ స్థలసేకరణకే 9 నెలలు పట్టింది. ఇప్పటికీ స్థలం కాంట్రాక్టర్‌కు అందజేయలేదు. మరో పదిరోజుల్లో అప్పగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. బొడ్డుపల్లి, అడవిదేవులపల్లి పీహెచ్‌సీలకు ఈ ఏడాది జనవరి 17వ తేదీన అగ్రిమెంట్ కుదిరింది. గతనెల 10వ తేదీనాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా పై పరిస్థితే. పదిరోజులని చెబుతున్నా.. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో వేచి చూడాలి. మరోపక్క రాములబండ పీహెచ్‌సీకి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రత్యామ్నాయ స్థలం చూడడానికే నెలలు పట్టింది. ఎప్పటిలోగా స్థల సేకరణ చేస్తారో, ఎప్పుడు టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఖరారు చేస్తారో అధికారులకే తెలియాలి.
నిధులున్నా.. నిర్మాణాలేవీ?
Published Fri, Nov 22 2013 3:24 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement