
సీట్లు లేవ్
సాక్షి, కడప : పల్లె లోగిళ్లలో చేసుకునేందుకు ఇష్టపడే సంక్రాంతి పండుగ సంబరాలకు పలువురు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. సాధారణంగా దసరా తర్వాత అన్నో ఇన్నో సెలవులు వచ్చేది సంక్రాంతికే. దాదాపు వారం రోజులపాటు సెలవులు రానున్న నేపధ్యంతోపాటు పండుగ సంబరాలను సొంత ఊళ్లలో సంప్రదాయబద్దంగా జరుపుకోవాలని ఎక్కడెక్కడో ఉన్న వారు సైతం తరలిరావడం ఆనవాయితీ. అరుుతే ప్రయాణ టెన్షన్ తెలుగు వారిని వెంటాడుతోంది.
ఇప్పటికే రిజర్వేషన్ నిమిత్తం కౌంటర్లకు వెళ్లి సీట్లు ఫుల్ అయ్యాయనే సమాధానంతో చాలామంది వెనుతిరుగుతున్నారు. రైళ్లలో కూడా దాదాపు రిజర్వేషన్ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి సొంత ఊరికి వచ్చేందుకు రద్దీ ఉంటుందని ముందే తెలుసుకున్న స్థానికులు నెల రోజుల ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవడంతో స్వస్థలాలకు ఎలా రావాలన్న ఆందోళన నెలకొంది.
బాదుడుకు ప్రైవేటు సిద్ధం
సంక్రాంతి రద్దీతో ఇదే అదునుగా భావించిన ప్రైవేటు యాజమాన్యాలు బాదుడుకు సిద్ధమవుతున్నాయి. ధరలు పెంచి టిక్కెట్లను విక్రయించేందుకు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులతోపాటు జిల్లా రవాణాశాఖ అధికారులు సైతం సాధారణ రేట్ల కంటే ఎక్కువ మొత్తానికి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఎంతమాత్రం ప్రైవేటు దోపిడీని అడ్డుకుంటారనేది వేచి చూడాల్సిందే. కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ ఇప్పటికే ఎవరు టిక్కెట్ అడిగినా లేదని చెబుతూ వారి డిమాండును సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, చెన్నై, బెంగుళూరు తదితర ప్రాంతాలలో వైఎస్సార్ జిల్లాకు చెందిన వేలాది కుటుంబాలు ఉపాధి నిమిత్తం వెళ్లి స్థిరపడిపోయారు. పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి ప్రతిసారి స్వస్థలాలకు వస్తుంటారు. ఆర్టీసీ నడిపే స్పెషల్ బస్సుల్లో కూడా భారీ ఛార్జీలు ముక్కుపిండి వసూలు చేయనున్నారు.
సాధారణంగా కడప-హైదరాబాదు మధ్య ఛార్జి రూ.500 అనుకుంటే, స్పెషల్ బస్సుల్లో రూ.750 వరకు అదనపు భారం పడనుంది. అయితే ప్రైవేటు ట్రావెల్స్‌తోపాటు ఆర్టీసీ సాధారణ సర్వీసుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తి కావడంతో కొంతమంది స్వస్థలాలకు వచ్చేందుకు ప్రైవేటు వాహనాలను బాడుగకు తీసుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కడప రీజియన్‌లో 200 ప్రత్యేక బస్సులు
వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని స్వగ్రామాల్లో చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతిపండుగ సీజన్ నేపధ్యంలో విజయవాడ, చెన్నై, బెంగుళూరు,హైదరాబాదు తదితర ప్రాంతాలకు సుమారు 200 ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. కడప రీజియన్‌లోనే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 200 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఆర్‌ఎం గోపినాథ్‌రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు.
ప్రత్యేక రైళ్లలో కూడా గగనమే
దక్షిణ మధ్య రైల్వే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని సాధారణంగా నడిచే రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. అయితే ప్రత్యేక రైళ్లను నడిపినా కూడా అప్పటికప్పుడు రిజర్వేషన్ సీట్లు లభించడం కష్టమేనని పలువురు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దూరమైనా కూడా ఇతర ప్రాంతాల చుట్టూ తిరిగి అయినా స్వగ్రామాలకు చేరుకోవాలని భావిస్తున్నారు.