
స్నానం చేయకముందే ప్రాణం పోయింది
కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గుండెపోటుతో వృద్ధుడి మృతి
కొవ్వూరు(రాజమండ్రి) : బావా.. అక్కా... మీరు రండి.. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పుష్కర పుణ్యస్నానం చేసి వెళుదురుగాని అని విజయవాడలో ఉన్న మరదలి మాటను మన్నించి వారు తిరుపతి నుంచి శనివారం కొవ్వూరు చేరుకున్నారు. బ్యాగులు రెండూ 75 ఏళ్ల వృద్ధుడైన శ్రీనివాసరావు పట్టుకుని నడుచుకుంటూ వెళుతున్నారు. నాలుగు అడుగులు వేస్తే గోష్పాద రేవు ఉందనగా ఆయన ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే వైద్య సిబ్బంది స్ట్రెచర్‌పై ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల సహాయంతో అతడిని వైద్య శిబిరానికి చేర్చారు. పరీక్షించిన వైద్యులు మరణించాడని నిర్ధారించారు.
కర్ణాటకకు చెందిన జీవణిగె శ్రీనివాసరావు(75) తిరుపతిలో స్థిరపడ్డారు. ఆయన భార్యతో కలిసి విజయవాడలో ఉంటున్న మరదలి ఇంటికి వచ్చారు. అక్కడ మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి కొవ్వూరుకు బస్సు మాట్లాడుకున్నారు. బస్సును కొవ్వూరులో ఆపకుండా రాజమండ్రి తీసుకెళ్లిపోయాడు. బస్సులోని వారు ఇదేంటని అడిగితే చివరికి వారిని శనివారం ఉదయం కొవ్వూరు తీసుకువచ్చాడు. భార్య, మరదలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గోష్పాదక్షేత్రానికి నడచి వెళుతున్న శ్రీనివాసరావు ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు.
వెంటనే ఆయనను వైద్య శిబిరానికి తరలించగా ఆక్సిజన్ పెట్టి, ఛాతీపై నొక్కుతూ చివరివరకు ఆయన ప్రాణాన్ని నిలిపేందుకు డాక్టర్లు, వెద్య సిబ్బంది ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.