వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : మద్యానికి బానిసైన భర్త పీడను వదిలించుకోవడానికి అతడిని కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన భార్యకు జీవితఖైదు శిక్ష విధిస్తూ రెండో అదనపు జిల్లా జడ్జి యార రేణుక మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కడకంచి ఎల్లయ్య పందులను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. ఒక కుమారుడు జన్మించిన తర్వాత మొదటి భార్య చనిపోయింది. 29 ఏళ్ల క్రితం లక్ష్మిని రెండో భార్యగా పెళ్లిచేసుకోగా వారికి ఒక కొడుకు, కూతురు జన్మించారు. ఎల్లయ్య మద్యానికి బానిస కావడంతో ఆమె తరచూ గొడవపడేది. ఈ క్రమంలో 2012 జూన్ 1న సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి వెనుక కుర్చోని ఉన్న ఎల్లయ్య బూతులు తిడుతుండడంతో నీవు చనిపోతే పీడ విరగడవుతుందంటూ జగ్గులో ఉన్న కిరోసిన్ ఎల్లయ్య తలపై పోసి అగ్గిపుల్లతో అంటించింది.
తల నుంచి కాళ్ల వరకు శరీరమంతా మంటలు లేవగా ఎల్ల య్య అరుపులతో చుట్టుపక్కలవారు వచ్చి మంటలార్పారు. జనగామ ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. చికిత్స సమయంలో చెప్పిన వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి మరణవాంగ్ములం పరిశీలించిన జడ్జి రేణుక ముద్దాయిపై నేరం రుజువుకావడంతో కడకంచి లక్ష్మికి యావజ్జీవ కారాగార శిక్ష, *100 జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసు విచారణను సీఐ నరేందర్ చేయగా, సాక్షులను హెడ్‌కానిస్టేబుల్ సంపత్‌కుమార్ కోర్టులో ప్రవేశపెట్టారు. లైజన్ అఫీసర్ రఘుపతిరెడ్డి పర్యవేక్షించగా ప్రాసిక్యూషన్ తర ఫున పీపీ విజయాదేవి వాదించారు.
మహిళా పీపీ వాదనలు.. మహిళా జడ్జి తీర్పు..
ప్రపంచ పురుష దినోత్సవం రోజున నేరస్తురాలైన స్త్రీని శిక్షిస్తూ మహిళా న్యాయమూర్తి తీర్పు వెల్లడించడం, నేరం నిరూపిస్తూ ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన పీపీ మహిళే కావడం యాదృచ్ఛికంగా జరిగింది. కోర్టులో ఈ అంశం చర్చనీయాంశమైంది.
భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు
Published Wed, Nov 20 2013 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement