‘వెలుగు’ వీరులకు రక్షణేది | 'Light' heroes Care | Sakshi
Sakshi News home page

‘వెలుగు’ వీరులకు రక్షణేది

Published Thu, Sep 11 2014 2:45 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

'Light' heroes Care

  •       భద్రత కరువైన ఎన్టీటీపీఎస్ కార్మికులు
  •      నిత్యం ప్రమాదాల అంచునే...
  •      అయినా పట్టించుకోని యాజమాన్యం
  •      నాణ్యత లేని రక్షణ కవచాల పంపిణీ
  •      పరికరాల కొనుగోలులో అవినీతి?
  • ఇబ్రహీంపట్నం : ఎంతో కష్టపడి చెమటోడ్చి ప్రపంచానికి విద్యుత్ వెలుగులు ప్రసరింపజేస్తున్న కార్మికుల జీవితాలు నిత్యం ప్రమాదాల అగ్నిగుండంలో మాడి మసైపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట ఎవరో ఒకరు ప్రమాదాల బారిన పడుతూ కుటుంబాలను దిక్కులేని వాళ్లను చేస్తున్నారు. అయినా  సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు గానీ, యాజమాన్యం కానీ పట్టించుకోకపోవడం శోచనీయం. ఎన్టీటీపీఎస్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల ప్రాణాలకు రానురాను రక్షణ లేకుండా పోతోంది.

    రెక్కల కష్టం చేస్తున్న కార్మికులకు కావాల్సిన రక్షణ కవచాల ఏర్పాటు విషయంలో అధికారులు మీన మీషాలు లెక్కిస్తున్నారు. ప్రతి కాంట్రాక్టు కార్మికుడికీ ఎలిమెంట్, షూ,హేండ్ గ్లౌజ్‌లు ధరింపజేసి డ్యూటీ   చేయించాల్సి ఉటుంది. ఎలక్ట్రికల్ పనులు చేసే చోట అయితే కరెంట్‌షాక్‌కు గురవకుండా అవసరమైన గ్లౌజ్‌లు సమకూర్చాల్సి ఉంటుంది. ప్రమాదాల నివారణకు అధికారులు నిత్యం పర్యవేక్షించాలి.
     
    శబ్ద కాలుష్యానికి గురవుతున్న కార్మికులు...

    ఎన్టీటీపీఎస్‌లోని కోల్ ప్లాంట్‌లోని క్రస్‌హౌస్, టర్బైన్,బాయిలర్ల వద్ద  పెద్ద శబ్దం వస్తుంటుంది. ఈ లొకేషన్‌లో పనిచేసే కార్మికులకు   ఇయర్ బగ్స్ ( చెవికి శబ్ద నిరోధక) కవచాలు సమకూర్చాల్సి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో అధికారులు ఈ నిబంధనకు తిలోదకాలివ్వడంతో శబ్ద కాలుష్యం వలన అనేక మంది కార్మికులు అనారోగ్యం పాలవుతున్నారు.
     
    ఎలిమెంట్ల కొనుగోలులో అవినీతి...


    ఆరు నెలల క్రితం కోల్ కన్వేయర్ బెల్టులో పడి రవిబాబు అనే కాంట్రాక్టు కార్మికుడు దుర్మరణం చెందాడు. అప్పట్లో కార్మికులు నిర్వహించిన ఆందోళనల ఫలితంగా ఎలిమెంట్లు, షూ, హేండ్ గ్లౌజ్‌లు ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. అయితే వాటిలో ఎలిమెంట్లు మాత్రమే ఇవ్వగలిగారు. ఇచ్చిన      ఎలిమెంట్లలో నాణ్యత లేకపోవడం వలన మంగళవారం రాత్రి ఎలిమెంట్ ధరించి ఉన్నప్పటికీ  పామర్తి నాగరాజు అనే కార్మికుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎలిమెంట్ల కొనుగోలులో లక్షలాది రూపాయలు చేతులు మారాయని, నాణ్యత లేని కారణంగానే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. ఎలిమెంట్ల కొనుగోలు అవినీతిపై విజిలెన్స్ విచారణ నిర్వహించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.
     
    నామమాత్రపు తనిఖీలు...

    ఫ్యాక్టరీ మేనేజర్  పర్యవేక్షణలో రక్షణ పరికరాలు పంపిణీ ఎలా ఉందనేది చూడాల్సి ఉంటుంది. ముందుగా గేట్ల వద్దనే కార్మికుడి వద్ద  రక్షణ పరికరాలు  ఉన్నాయా లేవా అనేది పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతించాలి. కానీ  రక్షణ పరికరాలు సమకూర్చడంలో యాజమాన్యం  విఫలం కావడంతో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.  ఎన్టీటీపీఎస్‌లో ప్రతి రోజూ తయారవుతున్న విద్యుత్ వల్ల కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. కానీ అందులో కష్టపడి పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం  విషయంలో మాత్రం  ప్రభుత్వం, జెన్‌కో యాజమాన్యం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.   కార్మికులకు నాణ్యమైన రక్షణ పరికరాలు సమకూర్చాలని పలువురు కార్మికులు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement