ఆర్టీసీ టీఎంయూ నేతపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు
- అవినీతికి పాల్పడ్డారని, కార్మికుల నుంచి డబ్బు వసూలు చేశారని లేఖలు
- ఆర్టీసీ ఎండీని నివేదిక కోరిన సీఎం కార్యాలయం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందటం ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది. ఈనెల 19న ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు జరుగనున్న సమయంలో ఈ ఫిర్యాదులు రావటం, వాటిల్లోని నిజానిజాలపై నివేదిక కోరుతూ నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ ఎండీని సీఎం కార్యాలయం ఆదేశించడం గమనార్హం. గతంలో ఆర్టీసీలో సాధారణ డ్రైవర్‌గా పనిచేసి, టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన అశ్వత్థామరెడ్డి.. తెలంగాణ ఉద్యమాన్ని, గత సాధారణ ఎన్నికలను అడ్డుపెట్టుకుని రూ.కోట్లు వసూలు చేశాడని మురళీధర్‌రెడ్డి పేరిట ముఖ్యమంత్రికి ఫిర్యాదు అందింది.
వనపర్తి నుంచి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడిన అశ్వత్థామరెడ్డి కాంగ్రెస్ నేతల పంచన చేరి రూ.కోట్లు తీసుకుని టీఆర్‌ఎస్ ఓటమికి యత్నించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల నుంచి సభ్యత్వ ఫీజు పేరుతో రూ.35 కోట్లు వసూలు చేశారని, ఇటీవల 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించినప్పుడూ డబ్బు వసూలు చేశారని, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వంద ఎకరాలకుపైగా భూములు సంపాదించారని ఆరోపించారు. ఆ ఫిర్యాదును పరిశీలించి ఓ నివేదిక అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. కార్మిక సంఘం ఎన్నికల కోసం ముమ్మర ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ వివరాలు వెల్లడికావడంతో.. ప్రత్యర్థి వర్గాలు దీనిపై కార్మికుల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. అశ్వత్థామరెడ్డి గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేశారన్న ఫిర్యాదులు గతంలోనూ ముఖ్యమంత్రికి వచ్చాయి.
టీఎంయూ నుంచి ఎన్‌ఎంయూలోకి..
అశ్వత్థామరెడ్డి అవినీతి అక్రమాలు, వేధింపులు తీవ్రమయ్యాయని ఆరోపిస్తూ ఆ యూనియన్ సంయుక్త కార్యదర్శి హన్మంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు ఎన్‌ఎంయూలో చేరారు. ఇలా 300 మంది కార్మికులు తమ యూనియన్‌లో చేరినట్టు ఎన్‌ఎంయూ నేత నరేందర్ ఓ ప్రకటనలో తెలిపారు.