శ్రీనివాస్‌ సర్వర్‌గా ఎందుకు మారినట్టు? | Limitations to the trial of Murder Case On YS Jagan | Sakshi
Sakshi News home page

విచారణకు పరిమితులు

Published Tue, Oct 30 2018 4:06 AM | Last Updated on Tue, Oct 30 2018 9:16 AM

Limitations to the trial of Murder Case On YS Jagan - Sakshi

(విశాఖ నుంచి సాక్షి ప్రతినిధులు): వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణకు ప్రభుత్వ పెద్దలు పరిమితుల చట్రం విధించారు. విచారణ కేవలం పాత్రధారికే పరిమితం చేసి, సూత్రధారుల పేర్లు బైటకు రాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పోలీసు అధికారులు సైతం అనధికారిక సంభాషణల్లో ఈ అంశాన్ని అంగీకరిస్తున్నారు. ప్రతిపక్ష నేత పై హత్యాయత్నం జరిగి ఐదు రోజులు అవుతోంది. హత్యాయత్నానికి పాల్పడ్డ జె. శ్రీనివాస్‌ను అసిస్టెంట్‌ చెఫ్‌ నుంచి ఫ్రొఫెషనల్‌ కిల్లర్‌గా మార్చేసి.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతమొందించాలన్న కుట్రకు సూత్రధారులైన ప్రభుత్వ పెద్దలు, టీడీపీ కీలక నేతలు లక్ష్యంగా విచారణ చేయకుండా విశాఖపట్నం నగర పోలీసులకు పరిమితులు విధిస్తూ ఉన్నత స్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లు పోలీసు వర్గాలే అంగీకరిస్నున్నాయి. విమానాశ్రయంలో ప్రవేశానికి శ్రీనివాస్‌కు అనుమతికి అభ్యంతరం లేదంటూ పోలీసులు జారీ చేసే ఎన్‌వోసీ(నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌)కు ఎవరు సిఫార్సు చేశారన్న దిశగా విచారణ చేపట్టడంలేదు. ఎన్‌వోసీ జారీకి సహకరించిన, ప్రయత్నించినవారి గురించి తీగలాగితే.. సూత్రధారులైన ప్రభుత్వ పెద్దల బండారం బయటపడటం ఖాయమనే భయంతో విచారణకు పరిమితులు విధించారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి.

పరిమితులకు ఆధారాలు ఇవిగో..
- ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం హత్యాయత్నం జరిగిన వెంటనే కలెక్టర్ల సదస్సు నుంచి ఉప ముఖ్యమంత్రి, హోం శాఖమంత్రి చిన రాజప్ప మీడియా ముందుకు వచ్చి గంటలోగా కేసును తేల్చేస్తాం అని ప్రకటించారు. కానీ.. ఆ తర్వాత కొద్ది నిముషాల్లోనే డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మీడియా ముందుకు వచ్చి ‘ప్రతిపక్ష నేతపై ఆయన అభిమానే దాడి చేశారు. ఇది చాలా చిన్న ఘటన.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. 11 పేజీల ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నాం’ అంటూ విచారణ ప్రాథమిక దశ కూడా చేరక ముందే తీర్పును ఇచ్చేయడం ద్వారా దర్యాప్తు అధికారుల ముందరకాళ్లకు బంధం వేసి ‘దిశానిర్దేశం’ చేసినట్లయింది. 

కలెక్టర్ల సదస్సు గురువారం పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రతిపక్ష నేతపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభిమానే దాడి చేశాడు. వాళ్లపై వాళ్లే దాడి చేసుకుని సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నారు’ అంటూ డీజీపీ ఆర్ఫీ ఠాకూర్‌ వెల్లడించిన ‘పరిమితుల’కు మరింత బలం చేకూర్చారు. ఆమేరకే విశాఖ పోలీసులు విచారణ సాగిస్తూ...నిందితుడు విచారణలో వెల్లడించిన అంశాలే ఆధారమంటూ అతనే నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొంటూ ఆదివారం రిమాండ్‌ రిపోర్ట్‌లో చేశారు.

విచారణ పేరుతో గంటపాటూ రెస్టారెంట్‌ నిర్వాహకుడు హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరిని పోలీసుస్టేషన్‌కు పిలించిన అధికారులు ఆయనకు రాచమర్యాదలు చేసి పంపించేశారు. నిందితుడు శ్రీనివాస్‌కూ ఇదే రీతిలో రాచమర్యాలు చేస్తున్నారు. 

సాధారణ కేసుల్లో సైతం పాత్రధారులతోపాటు ప్రధానంగా సూత్రధారుల బండారం బయటపెట్టడానికి పోలీసులు ప్రాధాన్యం ఇస్తారు. కానీ.. సాక్షాత్తూ ప్రతిపక్ష నేతను హతమార్చే లక్ష్యంతో పాశవికంగా దాడి చేస్తే కేవలం పాత్రధారునికే విచారణను పరిమితం చేశారు. సూత్రధారుల కుట్రను రట్టు చేసే బాధ్యత తమది కాదు అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు.

శ్రీనివాస్‌పై 2010లో నమోదైన క్రిమినల్‌ కేసు విచారణ ఇప్పటికీ సాగుతోంది. క్రిమినల్‌  ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి విమానాశ్రయంలో పని చేసేందుకు అనుమతి ఇవ్వరు. కానీ..శ్రీనివాస్‌కు విమానాశ్రయంలో ప్రవేశానికి పోలీసులతో ఎన్‌వోసీ ఇప్పించారు. విమానాశ్రయంలో రెస్టారెంట్‌ను టీడీపీ నేత హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరి నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌ అసిస్టెంట్‌ చెఫ్‌గా పనిచేసేందుకు శ్రీనివాస్‌ను ఆయనే రప్పించారు. అంటే.. పోలీసులతో శ్రీనివాస్‌కు ఎన్‌వోసీని ఇప్పించడంలో హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరి, టీడీపీ కీలక నేతలే ప్రధాన పోషించారన్నది స్పష్టమవుతోంది. ఈ దిశగా పోలీసులు విచారణ చేయడం లేదు.

సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్, ఇతర మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు సహా ఏ మంత్రి వచ్చినా హర్షవర్దన్‌ ప్రసాద్‌ హోటళ్ల నుంచే భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థులకు డబ్బులు పంపిణీ బాధ్యత తీసుకున్న మంత్రి నారాయణకు హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరి అన్ని విధాలా సహకరించారని ఆపార్టీ నేతలే చెబుతున్నారు. హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరికి రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు కార్యదర్శి రాజమౌళి ద్వారా తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు ఆ సంఘం కార్యదర్శి పురుషోత్తం వెల్లడించడం గమనార్హం. అంటే.. హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరిని లోతుగా విచారిస్తే ఈ కేసులో సూత్రధారులు అందరూ బయటకు వస్తారన్న భయంతోనే వాటికి పరిమితి విధించినట్లు స్పష్టమవుతోంది. 

సీఎం చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ వ్యవహరించిన తీరుతో ఈ కేసు దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని.. స్వతంత్ర సంస్థ (థర్డ్‌ పార్టీ)తో దర్యాప్తు చేయించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. కానీ.. శనివారం ఢిల్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు అవసరం లేదని తేల్చేశారు. వీటిని పరిశీలిస్తే తాము విధించిన పరిమితుల్లోనే విచారణ సాగించాలని సీఎం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

రెస్టారెంట్‌లో శ్రీనివాస్‌ అసిస్టెంట్‌ చెఫ్‌.. రమాదేవి సర్వర్‌. కానీ.. గురువారం శ్రీనివాస్‌ సర్వర్‌గా ఎందుకు మారినట్టు? అంటే.. ప్రతిపక్ష నేతను హతమార్చాలనే సూత్రధారులు వేసిన పథకంలో భాగంగానే శ్రీనివాసతో సర్వర్‌ వేషం వేయించినట్లు స్పష్టమవుతోంది. కానీ.. పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించడం లేదు.

పోలీసులు, మీడియా ఏం అడిగినా తాను చెప్పాల్సిందే లేఖలోనే చెప్పానని శ్రీనివాస్‌ చెబుతున్నారు. ఒక సాధారణ వ్యక్తి పోలీసులతో అలా మాట్లాడ వెనుక ధైర్యం అతనికి ఎక్కడినుంచి వచ్చింది. ఏ భరోసాతో అతను అలా మాట్లాడుతున్నాడు. ఈ పరిమితుల నేపథ్యంలో అదనపు సమాచారం కోసం పోలీసులూ ప్రయత్నించడం లేదు. ఒకవేళ అదనపు సమాచారం కోసం ప్రయత్నిస్తే తమ కుట్ర బైటకు వస్తుందన్న భయంలో సూత్రధారులు విచారణకు పరిమితులు విధించినట్లు స్పష్టమవుతోంది. 

కేసు నీరుగార్చేందుకు కుట్ర
హర్షవర్దన్‌ ప్రసాద్‌ రెస్టారెంట్‌లో విధుల్లో చేరే క్రమంలోనే శ్రీనివాస్‌ తన వెంట రెండు కత్తులు తెచ్చుకుని.. రెస్టారెంట్లో దాచినట్లు పోలీసు కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా ఆదివారం మీడియాకు వెల్లడించారు. కానీ.. రిమాండ్‌ రిపోర్ట్‌లో మాత్రం కత్తులను బుధవారం తెచ్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యంత పటిష్ఠ నిఘా, భద్రత ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంలోకి పదునైన కత్తులు ఎవరి సహకారంతో తీసుకెళ్లారనే అంశాన్ని సిట్‌ పట్టించుకోకపోవడం గమనార్హం. ఘటన అనంతరం నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నప్పుడు 11 పేజీల ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు చెప్పలేదు. కానీ.. ఈ అంశాన్ని పోలీసు అధికారులే తెరపైకి తెచ్చారు. ఆ 11 పేజీల లేఖను ముగ్గురు రాయడం.. ఆ లేఖ ప్రతులు కనీసం మడతలు పడకపోవడాన్ని బట్టి చూస్తే అదీ కూడా కేసును నీరుగార్చడానికి పోలీసులు అల్లిన కట్టుకథే అన్నది స్పష్టమవుతోంది.

సూత్రధారుల ప్రణాళిక మేరకే దాడి..
వైఎస్‌ జగన్‌కి గురువారం కాఫీ ఇచ్చేందుకు సర్వర్‌ రమాదేవి తొలి సారి వచ్చినప్పుడు శ్రీనివాస్‌ ఆమె వెంట లేడు. రెండో సారి రమాదేవి ఇంకెవరికైనా కాఫీ కావాలా అంటూ లాంజ్‌లోకి వచ్చిన సందర్భంలో వాటర్‌ బాటిల్‌ పట్టుకుని ఆమె వెంట సర్వర్‌ వేషంలో శ్రీనివాస్‌ కూడా వచ్చాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ  వైఎస్‌ జగన్‌తో సెల్ఫీ తీసుకుంటుండగా శ్రీనివాస్‌ జగన్‌పై పాశవికంగా కత్తితో హత్య చేయడానికి ప్రయత్నించాడు. దాంతో ఆయన ఎడమ భుజంపై తీవ్రమైన గాయమైంది. జగన్‌ మెడపై దాడి చేయాలన్న లక్ష్యంతో శ్రీనివాస్‌ మరో సారి దాడికి తెగబడే సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు, పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కానీ.. రిమాండ్‌ రిపోర్ట్‌లో ఈ అంశాలేవీ పేర్కొనలేదు. వీటిని పరిశీలిస్తే సూత్రధారులు రూపొందించిన ప్రణాళిక మేరకు.. ఏమాత్రం భద్రత లేదని నిర్దారించుకున్న తర్వాతే శ్రీనివాస్‌ ప్రతిపక్ష నేతపై హత్యాయత్నానికి తెగబడినట్లు స్పష్టమవుతోంది. ఈ దిశగా సిట్‌ దర్యాప్తు చేయకపోవడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement