
జంతు ప్రదర్శనశాలలో మృతి చెందిన సింహం పిల్ల
శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో వరుసగా వన్యప్రాణులు మృతిచెందుతున్నాయి. దీని వెనుకఅసలు కారణం ఏమిటనేది అంతుచిక్కడం లేదు.
వరుసగా మూగ జీవాలు మృతి చెందుతున్నాయి.వన్యప్రాణుల కేర్ టేకర్ల పర్యవేక్షణ లోపమా.. వైద్యులనిర్లక్ష్యమా.. అధికారుల పనితీరు లోపమా.. అనేది తెలియడం లేదు. ఈ క్రమంలో గురువారం మగ సింహం పిల్ల మృతి చెందింది. కేన్సర్ వ్యాధితో మృతి చెందిందని పశు వైద్యులు నిర్ధారించారు. గత నెలలో కూడా మనుబోతులు మూడు మృతి చెందాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక వడదెబ్బ వల్ల జంతువులు మృతి చెంది ఉండవచ్చనే అనుమానం కూడా ఉంది.
తిరుపతి సిటీ: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో వన్యప్రాణులు రోజురోజుకు అంతరించిపోతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 28 మూగజీవాలు మృతి చెందినట్లు జూ పార్క్ రికార్డుల్లో నమోదైంది. మూగజీవాల మృతికి కారణం ఏమిటనే విషయం అంతుపట్టడం లేదు. జూలో 1,068 వన్యప్రాణులు ఉన్నాయి. వాటిలో ఇటీవల రెండు మనుబోతులు,ఒక కణితి, చుక్కల దుప్పి, బుర్ర జింక కూడా మృతిచెందాయి. గురువారం 8 నెలల మగ సింహం పిల్ల మృతి చెందింది. ఇది వడదెబ్బకు గురై మృతి చెందిందనే అనుమానాలు ఉన్నాయి. జూ క్యూరేటర్ మాత్రం ఊపిరాడక మృతి చెందిందని చెప్పారు.
ముందే పసిగట్టలేని వైద్యులు
సింహం పిల్ల అనారోగ్యానికి గురైందని జూలో ఉన్న డాక్టర్లు ముందుగా పసిగట్టలేకపోయారు. వైద్యులు జంతువుల ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచడం లేదని ఈ సంఘటన బట్టి తెలుస్తోంది. డాక్టర్లు జూ అంతటిని కార్లలో చుట్టి వెళ్లిపోతుంటారు. జంతువులు ఉండే చోటికి వెళ్లి కారు దిగకుండానే అనిమల్ కీపర్‌ను వారి దగ్గరకు పిలుపించుకుని జంతువు బాగుందా.. ఫీడ్ తీసుకుంటుందా అని అడిగి వెళ్లిపోతుంటారు.
పోస్టుమార్టంపై అనుమానాలు
జూలో ఏ జంతువు మృతి చెందినా వెటర్నరీ యూనివర్సిటీకి పంపించి పోస్టుమార్టం నిర్వహించాలి. గతంలో ఇదే విధానాన్ని అధికారులు అమలుచేసేవారు. కానీ ప్రస్తుతం జూ లోనే అక్కడున్న వైద్య సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించి దహనక్రియలు చేస్తుండడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
స్ప్రింక్లర్లు ఉన్నా.. నామమాత్రమే.
జూలో మొత్తం 1,500 స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. అన్నింటిని పూర్తిగా వినియోగించడంలేదు. ఏవరైనా వీఐపీలు వచ్చిన సమయంలో వాటిని వినియోగంలోకి తెస్తారు. మిగిలిన సమయాల్లో వాటిని వినియోగించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment