గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. మద్యం గ్లాసుల గలగలలతో పచ్చని గ్రామీణుల జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. రేషన్ దుకాణాలు లేని గ్రామాలున్నాయేమోగానీ..మద్యం గొలుసు దుకాణంలేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. ఎక్సైజ్ అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని..చూసీచూడనట్లు ఉండటంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగిపోతున్నాయి. ఎమ్మార్పీకన్నా ఎక్కువగా విక్రయిస్తూ మందుబాబుల జేబులు లూటీ చేస్తున్నారు.
చినగంజాం: గ్రామాల్లో లెసైన్సు మద్యం షాపులకు పదింతలు బెల్టు షాపులు నడుస్తున్నాయి. చిల్లర దుకాణాలను సైతం బెల్టుషాపులుగా మార్చేస్తున్నారు. ఎమ్మార్పీకి మించి మద్యం అమ్ముతూ ఇష్టం వచ్చిన కాడికి దండుకుంటున్నారు. లెసైన్స్ దుకాణాల పక్కనే బెల్టుషాపులు నడుపుతూ రాత్రి, పగలు తేడా లేకుండా అర్ధరాత్రిళ్లు సైతం మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన ఎక్సైజ్ విధానం అమలు కావడం లేదు.
చినగంజాం మండలంలో 4 లెసైన్స్ దుకాణాలుండగా అనధికార మద్యం షాపులు మాత్రం 40 పైగా నడుస్తున్నాయి. చినగంజాం, రాజుబంగారుపాలెం, మూలగానివారిపాలెం, పల్లెపాలెం, మోటుపల్లి, కడవకుదురుల్లో బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. బడ్డీ కొట్లలో మహిళలు సైతం దర్జాగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్క రాజుబంగారుపాలెంలోనే ఆరుకు పైగా దుకాణాల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి.
ఇంకొల్లు మండలంలో లెసైన్స్ దుకాణాలు 4 మాత్రమే కాగా అనధికార మద్యం షాపులు 30 దాకా ఉన్నాయి. ప్రతి గ్రామంలోను రెండుకు తక్కువ కాకుండా బెల్టు షాపులు కొనసాగిస్తున్నారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులు కొల్లగొడుతున్నారు.
మార్టూరు మండలంలో 6 లెసైన్సు షాపులుండగా 20కి పైగా అనధికార మద్యం షాపులు కొనసాగుతున్నాయి. దాబాల్లో సైతం మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
పర్చూరు మండలంలో లెసైన్స్ మద్యం షాపులు 2 మాత్రమే ఉండగా.. మండలంలో అన్ని గ్రామాల్లో 50కి పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి.
యద్దనపూడి మండలంలో ఒకే ఒక లెసైన్సు మద్యం షాపుండగా 25కుపైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. మండలంలోని యద్దనపూడి, పూనూరుల్లో అనధికార మద్యం షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. లెసైన్సు మద్యం షాపు తాతపూడి హైవేపై ఉండటంతో గ్రామాల్లో విపరీతంగా బెల్టు షాపులు పెరిగిపోయాయి
అమలు కాని ఎమ్మార్పీ:
మద్యం వ్యాపారులు ఎమ్మార్పీకి మించి అమ్ముతూ ప్రజల జేబులు కొల్లగొడుతున్నారు. బీరు ఎమ్మార్పీ రూ.95 అమ్మాల్సి ఉండగా లెసైన్స్ షాపులో రూ.115, బెల్టుషాపులో రూ.125 వరకు అమ్ముతున్నారు. విస్కీ, బ్రాందీ, రమ్ము వంటివి క్వార్టర్ బాటిల్ ధరలు రూ.10 నుంచి రూ.15లకు పెంచి అమ్ముతుండగా, బెల్టు షాపుల్లో రూ.15 నుంచి రూ.25 లకు విక్రయిస్తున్నారు.
మచ్చుకైనా కనిపించని నియంత్రణ కమిటీలు:
గ్రామాల్లో విపరీతంగా పెరిగిపోతున్న అనధికార మద్యం దుకాణాలను నియంత్రించేందుకు ప్రభుత్వం నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా..వారి జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. బెల్టు దుకాణాలను నియంత్రించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. మండల స్థాయి కమిటీలో ఎంపీపీ చైర్మన్, ఎంపీడీవో కన్వీనర్‌గా ఎస్సై, తహశీల్దార్, ఎక్సైజ్ ఎస్సై, మండల సమాఖ్య అధ్యక్షురాలు సభ్యులుగా ఉంటారు. గ్రామ స్థాయి కమిటీలో సర్పంచ్, కార్యదర్శి, వీఆర్వో, ఐకేపీ సభ్యులు ఉంటారు. కమిటీలు కనీసం 15 రోజులకొకసారి సమావేశమై సమీక్ష నిర్వహించి గ్రామాల్లో బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ వీటి దాఖలాలే లేవు.
బెల్టు షాపులు నివారించేందుకు చర్యలు
- ఎం వెంకటరెడ్డి, ఎక్సైజ్ సీఐ, చీరాల
గ్రామాల్లో బెల్టుషాపులు నివారించేందుకు తర చూ పర్యటిస్తున్నాం. అనధికారికంగా మద్యం అమ్మినట్లు మా దృష్టికి వస్తే వారిపై కేసులు బనాయిస్తున్నాం. దాదాపు బెల్టుషాపులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బెల్టుషాపులు నడుపుతున్నట్లు సమాచారం మాకందిస్తే తక్షణం చర్యలు తీసుకుంటాం.
తెగని బెల్టు
Published Mon, Dec 1 2014 12:35 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement