
ఏపీలో భూ ప్రకంపనలు
రాష్ట్ర రాజధాని ప్రాంతం సహా పలు ప్రాంతాల్లో స్వల్పంగా కంపించిన భూమి
విజయవాడ బ్యూరో: నేపాల్ రాజధాని కఠ్మాండు కేంద్రంగా శనివారం సంభవించిన భూకంపం ఆంధ్రప్రదేశ్‌పైనా ప్రభావం చూపింది. రాష్ట్ర రాజధాని ప్రాంతంతో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం స్వల్ప స్థాయిలో భూప్రకంపనలు సంభవించాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వివిధ ప్రాంతాల్లో వచ్చిన ఈ భూ ప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలోని అమరావతి, ఉండవల్లి ప్రాంతాల్లోనూ స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఇదిలా ఉండగా భూప్రకంపనల వల్ల కొన్నిచోట్ల ఇళ్లల్లో సామాను కదిలిపోయింది.
అయితే ఎక్కడా చెప్పుకోదగిన నష్టమేది జరగలేదు. నిజానికి కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలను ప్రజలు తొలుత గుర్తించలేక పోయారు. ఒళ్లు తూలుతున్నట్టు.. కళ్లు తిరుగుతున్న అనుభూతికి లోనై తమకు ఏదో అవుతోందంటూ కంగారు పడ్డారు. ఆ తరువాత భూప్రకంపనలుగా గుర్తించారు. భూ ప్రకంపనల తీవ్రత కాస్త ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వెంటనే వీటిని గుర్తించిన ప్రజలు ఇళ్లు, షాపుల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 3 సెకన్ల అత్యల్ప సమయం పాటు ప్రకంపనలు రాగా... మరికొన్ని ప్రాంతాల్లో 8 సెకన్ల వరకు భూ ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు.