నెట్టింట్లో పెళ్లిసందడి | Live broadcasts of the wedding in Internet | Sakshi
Sakshi News home page

నెట్టింట్లో పెళ్లిసందడి

Published Sun, Feb 9 2014 6:15 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

Live  broadcasts of the wedding in  Internet

మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : ఒకప్పుడు నగరాలకే పరిమితమైన సాంకేతిక విప్లవం ఇప్పుడు పట్టణాలు, గ్రామాలకూ విస్తరించింది.ఇంటర్‌నెట్ ఉంటే ప్రపంచం గుప్పిట్లోకి వచ్చినట్లే కదా మరి. మారుమూల గ్రామాల్లో జరిగిన శుభకార్యాలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఏర్పడింది. ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి రావడంతో విదేశాల్లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.

 పెళ్లి పిలుపునకు కొత్త పుంతలు
 సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు నేటి తరం వారు. వివాహ ఆహ్వానాలకు కొత్త పుంతలు తొడుగుతున్నారు. పెళ్లి కార్డులిచ్చి పెళ్లికి రావాలని ఆహ్వానించే రోజులు పోయాయి. సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు, ఇంటర్‌నెట్‌లో ఆహ్వానాలు పలుకుతున్నారు. పూర్వం స్వయంగా పెళ్లికి పిలుస్తే తప్ప వెళ్లే వారు కాదు. అంత పంతం ఉండేది. అందుకే స్వయంగా ఆహ్వానించే వారు. కానీ ఇప్పుడు సెల్‌ఫోన్, ఈ మెయిల్, ఫేస్‌బుక్‌లో ఆహ్వానం పలకగానే పెళ్లికి హాజరవుతున్నారు. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వాగతిస్తున్నారు.
 
 
 ఇంటర్నెట్‌లో ప్రత్యక్ష ప్రసారం
 ఒకప్పుడు ఎన్ని పనులున్నా దగ్గరి వారి పెళ్లికి వ్యయ ప్రయాసలకోర్చి హాజరయ్యేవారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వారు తప్ప చాలా మంది వివాహ శుభ కార్యాలయాలకు హాజరు కావడం లేదు. ముఖ్యంగా విదేశాల్లో, ఇతర రాష్ట్ర్రాల్లో స్థిరపడిన వారి పరిస్థితి చెప్పనక్కరలేదు. విదేశాల్లో ఉన్న వారు వివాహ వేడుకలకు రావాలని ఆశ పడినా యజమానులు అనుమతి ఇవ్వకపోవడం, ఇచ్చినా విమానం టికెట్ రిజర్వేషన్ లభించకపోవడం జరుగుతుంది.

ఒకవేళ అన్నీ అనుకూలించినా రానుపోను వ్యయం తడిసి మోపెడవుతుందనే కారణంతో రాలేని వారున్నారు. అలాంటి వారికి ఇంటర్నెట్ సౌలభ్యంగా మారింది. వివాహం వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉన్నా క్షణాల్లో ప్రత్యక్షంగా పెళ్లి తంతును చూసే వీలుంది. పెళ్లి మండపంలో  కంప్యూటర్, ఇంటర్‌నెట్ సౌకర్యం ద్వారా పెళ్లిని ప్రత్యక్షంగా చూసి ముచ్చటపడవచ్చు. ఇప్పుడు గ్రామాలకు కూడా ఈ సౌకర్యం విస్తరించడ ంతో విదేశాల్లో ఉన్న వారి కోసం ఇంటర్నెట్ పెళ్లిని ఏర్పాటు చేస్తున్నారు.
 
 ఇలా వీక్షించవచ్చు..
 పెళ్లిని ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలంటే అందుకు కావలసింది2 ఎంబీపీఎస్ వేగం గల ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్. వివాహ వేడుకలను వీడియో తీసే కెమెరాకు సర్వర్‌ను(కేబుల్)ద్వారా కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు. ప్రత్యేకమైన సైట్‌లో లైవ్‌గా ప్రసారం చేస్తారు. రెండు, మూడు క్షణాల తేడాతో ప్రపంచం అంతా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. నేరుగా వివాహం చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది.
 
 ఖర్చు కూడా తక్కువే....
 ఇంటర్నెట్‌లో పెళ్లి వీక్షణం సౌలభ్యం ఏర్పాటుకు ఖర్చు కూడా ఎక్కువేమీ కాదు. తక్కువ డబ్బుకు ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రత్యక్ష ప్రసారాలు చేసే సాంకేతిక నిపుణులకు బాధ్యతలు అప్పగిస్తే చాలు వారే అన్నింటినీ పొందుపరుస్తారు. వివాహ తంతు ఆసాంతం ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారు.
 
 ఇంటి నుంచే మాట్లాడుకోవచ్చు
 అమ్మా ఏం కూర చేశావు... చెల్లె ఏమి చేస్తుంది.. నీవు కట్టుకున్న చీర బాగుంది.. అంటూ వంటావార్పు చేసుకుంటూ కూడా ప్రత్యక్ష ప్రసారాలతో మాట్లాడుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వారు ఇక్కడి వారిని అక్కడి వారిని ఇక్కడ వారు ఇలా ఒకరిని రోజు పలకరించుకోవచ్చు. దీంతో ఎంత సుదూరంలో ఉన్నా నేరుగా కలుస్తున్నామనే ధీమా ఏర్పడుతుంది.

ఒక్క వివాహ వేడుకలే కాకుండా విదేశాల్లో ఉన్న, లేక స్థానికంగా ఉన్న వారు పుట్టిన రోజు, సత్యనారాయణ వ్రతాలు అన్నింటిని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో విదేశీ సంబంధాలు చాలా బలపడ్డాయి. విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురుతో మాట్లాడే వారి సంఖ్య పెరిగింది. ఇంట్లో కంప్యూటర్, బుల్లి కెమెరా ఏర్పాటు చేసుకుని ఇంటర్‌నె ట్ సౌలభ్యంతో ప్రత్యక్ష ప్రసారాలు మాటా ముచ్చట జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement