బ్యాంక్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళలు
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి , ఏలూరు: పసుపు – కుంకుమ పేరుతో ఇచ్చిన చెక్కులను పాత బకాయిలకు జమ చేయడంపై మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల పొదుపు డబ్బుల్లో చెక్కులు జమ చేసుకోవాలంటూ బ్యాంకర్లు సూచిస్తున్నారు. డబ్బులు సభ్యులకు ఇస్తున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనిపై డ్వాక్రా సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2014 ముందు రుణాలు ఎవ్వరూ చెల్లించవద్దు. మొత్తం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. బాకీ రద్దు అవుతుందన్న నమ్మకంతో మహిళలు బ్యాంకు రుణాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకర్లు ఆ అప్పు తీర్చాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మధ్యమధ్యలో కొత్త రుణం ఇచ్చినట్లుగా చూపించి ఆ డబ్బులను పాత బకాయికి జమ చేసుకుంటూ బుక్ అడ్జస్ట్‌మెంట్లు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పసుపు–కుంకుమ పథకంలో బాగంగా తొలివిడతగా ఒక్కో గ్రూపునకు రూ.25 వేల చెక్కును ఇస్తోంది. దీనినిపాత బకాయికి బ్యాంకర్లు జమ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పసుపు కుంకుమ డబ్బులు అప్పులో వేయకపోతే ఊరుకోబోమంటూ సీసీలపై ఒత్తిడి తెస్తున్నారు.
కామయ్యపాలెంలో ఆందోళన
తాజాగా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం ఆంధ్రాబ్యాంక్‌లో మహిళలకు ఇస్తున్న పసుపు కుంకుమ సొమ్ములు బాకీలకు జమచేయడంపై వెయ్యడంపై మహిళలు ఆగ్రహించారు. బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన రుణ మాఫీ హామీ వల్ల మోసపోయామని మాఫీ సొమ్ములు కాని, పసుపు కుంకుమ సొమ్ములు కానీ ఒక్క రూపాయి కూడా తాము తీసుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క జీలుగుమిల్లి మండలంలో 794 డ్వాక్రా గ్రూపులు ఉండగా, చంద్రబాబునాయుడు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీ దెబ్బకు జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం ఆంధ్రాబ్యాంక్ పరిధిలోని సుమారు 3 వందల గ్రూపులు మూలనపడ్డాయి. తీసుకున్న రుణాలు తిగి చెల్లించలేక డీఫాల్టర్లుగా మారాయి. ఇదే బ్యాంక్ పరిధిలో గత ఏడాది డ్వాక్రా మహిళల ఇళ్లకు సైతం బ్యాంక్ అధికారులు తాళాలు వేశారు. రుణామాఫీ కింద ఇచ్చిన రూ.పదివేల సొమ్ములు, పసుపు కుంకుమ సొమ్ములు మొత్తం పాత అప్పుకే చాల లేదు. మిగిలిన బాకీని వన్‌టైం సెటిల్‌మెంట్ æ చేసుకోవాలని బ్యాంక్ అధికారుల చెబుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీసుకున్న రుణం ఐదురెట్లు పెరిగింది
ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు మాట నమ్మి తీసుకున్న అప్పు తిరిగి కట్టలేదు. ఈ ఐదేళ్లలో తీసుకున్న రుణం వడ్డీతో కలిపి మూడు రెట్లు పెరిగింది. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ సోమ్ము, పసుపు కుంకుమ సొమ్ము తీసుకున్న అప్పుకి పెరిగిన వడ్డీకి చాలలేదు. చంద్రబాబు మహిళలను రుణమాఫీ పేరు చెప్పి అప్పులపాలు చేశారు.– జి.కోరమ్మ. కనకాపురం. జీలుగుమిల్లి మండలం.
ఎన్నికల ముందు మహిళలు గుర్తుకు వచ్చారు
ఎన్నికల ముందు చంద్రబాబుకు మహిళలు గుర్తుకు వచ్చారు. ఐదేళ్లలో మహిళలకు పైసా ఇవ్వని చంద్రబాబు ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు కుంకుమ పేరుతో మహిళలను మభ్య పెడుతున్నారు. ఇచ్చిన చెక్కులను బ్యాంక్ అధికారులు పాత బాకీలకు జమ వేసుకుంటున్నారు.– సున్నం వరలక్ష్మీ.రాచన్నగూడెం.జీలుగుమిల్లి మండలం
Comments
Please login to add a commentAdd a comment