అప్పుల తిప్పలు మామూలే
1.20 లక్షల టన్నుల విత్తనాలు సిద్ధం సాగునీటి సమస్యలు రావు
ఎన్ని ఎరువులైనా ఇస్తాం రుణాల సంగతి చూస్తాం
ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బందులు ఉండవంటున్న ప్రజాప్రతినిధులు
ఏలూరు (టూ టౌన్): వడ్డీ లేని రుణ రాయితీలకు ప్రభుత్వం తాజాగా మొండిచేయి చూపింది. రూ.లక్ష వరకూ వడ్డీలేని రుణాలు, రూ.3 లక్షలలోపు పావలా వడ్డీ రుణాలపై ఇచ్చే రాయితీ విడుదల చేయకుండా రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. జీఓ జారీ చేసినా నిధులు కేటాయించకుండా వంచిస్తోంది. రుణమాఫీ సందడిలో జీడి పాకంలా సాగుతున్న నయవంచనకు అన్నదాతలు బలైపోతున్నారు. రాయితీల సంగతి దేవుడెరుగు కనీసం ఖరీఫ్ పంటకైనా రైతులకు రుణాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. అన్నదాతలు ప్రైవేటు ఆప్పులు చేయక తప్పేలా లేదు. జిల్లా వ్యాప్తంగా 2.40 లక్షల హెక్టార్లలో అన్నదాతలు వరిసాగు చేసేందుకు సమాయత్తమయ్యారు. 1.20 లక్షల టన్నుల విత్తనాలను అధికారులు సిద్ధం చేశారు.
జిల్లాలోని 10 ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా స్వర్ణ రకం విత్తనాలు 33 వేల టన్నులు, ఎంటీయూ 1061, 1064, 1075, 1110, 1001 తదితర రకాలకు చెందిన మరో 32 వేల టన్నుల విత్తనాలు సైతం సిద్ధంగా ఉన్నాయి. ఖరీఫ్‌కు రెండు లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతానికి 50వేల టన్నులు సిద్ధంగా ఉన్నాయి. ఎరువుల వాడకానికి ఇంకా నెల సమయం ఉండటంతో అప్పటికి పూర్తిస్థాయిలో నిల్వలు పెడతామని స్పష్టం చేస్తున్నారు. కాలువలకు పుష్కలంగా నీరు విడుదల చేయటంతో సాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఉండవన్న అభిప్రాయం అధికారులు, ప్రజా ప్రతినిధుల్లో ఉంది. జిల్లాలోని వాణిజ్య బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా రూ.5,200 కోట్లను పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ రైతులకు అందే పరిస్థితులు కనబడటం లేదు.
ఖరీఫ్ పంట కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యేలు భరోసా ఇస్తున్నారు. రుణాల సంగతి ఏమిటని అడిగితే నీళ్లు నములుతూనే.. రుణాలిచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తామంటున్నారు.