రుణమాఫీకి బినామీ ‘అప్పు’లోడ్ !
బోగస్ రుణాలని తేలితే రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలను గొట్లాం పీఏసీఎస్ అధికారులు పట్టించుకోలేదు. ఈ సొసైటీలో బినామీ పేర్లతో రుణాలు పొందారని గత విచారణలో తేలినా... డీసీసీబీ అధికారులు ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. అలా రుణాలు పొందిన వారి ఖాతాలను ఇప్పుడు రుణ మాఫీ కోసం అప్‌లోడ్ చేశారు. మరో పక్క అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్థాయి అధికారితో మళ్లీ విచారణ నిర్వహిస్తున్నారు. కానీ తాజా విచారణకు అభియోగాలు ఎదుర్కొంటున్న రైతులు సహకరించడం లేదు. ఈ మొత్తం వ్యవహారం సహకారశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : బొండపల్లి మండలం గొట్లాం పీఏసీఎస్‌లో 1,559 మందికి నిబంధనలకు విరుద్ధంగా రూ.కోటి 3లక్షల 78వేల 803మేర రుణాలిచ్చారని గత ఏడాది నిర్వహించిన సెక్షన్ 53 విచారణలో తేల్చారు. అప్పట్లో వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల దృష్ట్యా డీసీసీబీ ఏజీఎం స్థాయి అధికారి విచారణ చేశారు. ఈ విచారణలో అవకతవకలు జరిగాయన్న నిర్ధారణకొచ్చారు. కాకపోతే, ఈ అక్రమాలకు అప్పట్లో సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శులుగా పనిచేసి, మృతి చెందిన వారిని బాధ్యులను చేస్తూ నివేదికలో పేర్కొన్నారు. కానీ సొసైటీ సిబ్బంది, డెరైక్టర్ల విషయాన్ని పట్టించుకోలేదు. వాస్తవానికి సొసైటీలో ఏ అక్రమాలు జరిగినా అందులో పర్యవేక్షక అధికారులు, పాలకవర్గం ప్రతినిధులగా డెరైక్టర్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఎందుకంటే, ఎవరికి రుణమిచ్చినా పరిశీలించాల్సిన బాధ్యత సూపర్‌వైజరీ అధికారులపై ఉండగా, ఎవరికెంత రుణం ఇచ్చారన్నదానిపై పాలకమండలి సభ్యులంతా తీర్మాణం చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన అక్కడి అక్రమాలపై సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ విచారణ అధికారులు చనిపోయిన సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శిని బాధ్యుల్ని చేసి చేతులు దులిపేసుకున్నారు. రూ.కోటి 3లక్షల 78వేల 803 మేర అక్రమాలు జరిగినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు, సరికదా ఒక్క పైసా కూడా రికవరీ చేయలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇటీవల ఒకరు జిల్లా సహకార శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ భారీగా అక్రమాలు జరిగాయని, బినామీ రుణాలు పెద్ద ఎత్తున ఇచ్చారని గ్రీవెన్ సెల్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా రుణాలు పొందిన వారి పేర్లను రుణమాఫీ కోసం అప్‌లోడ్ చేశారన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఒకవైపు గత విచారణపై తీసుకున్న చర్యలేంటని డీసీసీబీని ఆరాతీస్తూనే, మరోవైపు సెక్షన్ 51విచారణ చేపట్టే ఉద్దేశంతో ప్రాథమిక విచారణకు తాజాగా ఉపక్రమించారు. అసిస్టెంట్ రిజిస్టార్ వాణి శైలజ ప్రస్తుతం గొట్లాం పీఏసీఎస్ పరిధిలో విచారణ చేపడుతున్నారు. సెక్షన్ 53 విచారణలో ఎవరికైతే నిబంధనలకు విరుద్ధంగా రుణాలిచ్చారని తేల్చారో వారిని ఇప్పుడెళ్లి విచారిస్తే తమకేమీ తెలియదని కొందరు, ఇంట్లో పెద్ద వాళ్లు లేరని మరికొందరు విచారణ అధికారికి ముఖం చాటేస్తున్నారు. దీంతో విచారణలో ఆమె ముందుకెళ్లలేకపోతున్నట్టు తెలిసింది.
ఇదంతా అక్రమార్కులు పథకం ప్రకారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, ఉన్నత స్థాయి విచారణ చేపడితే తప్ప వాస్తవాలు బయటికొచ్చే అవకాశం లేదు. లేదేంటే బినామీ రుణాలు కూడా రుణమాఫీలో సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. తద్వారా రైతులు పేరు చెప్పి సొమ్ము దిగమింగేసిన బడాబాబులకు మేలు చేసినట్టు అవుతుంది. అంతేకాకుండా వారి అవినీతి భాగోతం బయటపడకుండా కాల గర్భంలో కలిసిపోతుంది.