కొండెక్కని ట్రైకార్ రుణాలు..!
♦ 2016–17 సంవత్సరంలో రుణాల ఊసేలేదు
♦ 2015–16 లక్ష్యం నెరవేరలేదు
♦ 2014–15లో 1601 యూనిట్లకు ఇచ్చినవి 491 యూనిట్లే
♦ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న గిరిపుత్రులు
♦ రుణాల మంజూరుకు ఆసక్తి చూపని బ్యాంకర్లు
♦ రికవరీ చేయలేమంటూ మొండిచేయి చూపుతున్న వైనం
♦ పట్టించుకోని పాలకులు, అధికారులు ఆవేదనలో లబ్ధిదారులు
విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు వారికి ఇప్పటికీ ఆమడ దూరమే. కనీసం రుణ మందితే స్వయం ఉపాధి పొందుదామని, ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుందామని ఆశించిన గిరిపుత్రులకు నిరాశే ఎదురవుతోంది. పాలకులు, అధికారుల కరుణలేకపోవడంతో దరఖాస్తు చేయడమే తప్ప చేతికి రుణం అందడం లేదు. వ్యయప్రయాసల కోర్చి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా మొండిచేయి చూపుతున్నారు. రుణాలు రికవరీ చేయలేమంటూ బ్యాంకర్లు ముఖం చాటేస్తున్నారు. ఫలితం.. రుణాలు కొండెక్కడం లేదు. గిరిజనుల బతుకులు మారడం లేదు. దీనికి నెరవేరని ట్రైకార్ రుణాల లక్ష్యం.. గ్రౌండింగ్ కాని యూనిట్లు.. అందని రాయితీలే నిలువెత్తు నిదర్శనం.
పార్వతీపురం టౌన్: గిరిజనుల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ఏటా మంజూరు చేసే ట్రైకార్ రుణాలు గిరిజనుల చేతికి చేర డం లేదు. రుణాలు అందించడంలో అ ధికారులు, బ్యాంకర్ల అలక్ష్యం గిరిపుత్రులకు శాపంగా మారింది. రుణ లబ్ధి దారుల జాబితాను తయారు చేసినా రుణాల మంజూరు ‘ఎక్కడవేసిన గొంగ ళి అక్కడే’ అన్న చందంగా తయారైంది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఒక్క గిరిజనుడికీ రుణం అందలేదు. దరఖాస్తుదారులందరూ రుణాల కోసం ఎదురు చూస్తున్నా నిరాశే ఎదురవుతోంది. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపడంలేదు. ఇప్పటికీ యూసీ అప్‌లోడ్ చేయలేదు. ఏడాది కాలంగా రుణ అర్హత పొందిన లబ్ధిదారులు కలెక్టర్, ఐటీడీఏ పీవో కార్యాలయాల చుట్టూ తిరిగి గ్రీవెన్స్‌సెల్‌లో వినతులు సమర్పిస్తున్నా స్పందన లేకపోతోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన యూనిట్‌లు ఇంకా కొన్ని గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 2016–17 ఆర్థిక సంవత్సరానికి ట్రైకార్ రుణాలు 215 యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు.
వీరికి ప్రభుత్తం రూ.2.72 కోట్లు రుణ లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ప్రభుత్వం తరఫున అందించాల్సిన రాయితీ రుణం రూ.1.60 కోట్లు కూడా రిలీజ్ చేసింది. బ్యాంకర్లు అందించాల్సిన రూ.1.11 కోట్లు రుణాన్ని మాత్రం రిలీజ్ చేయడంలో అలసత్వం వహిస్తున్నారు. దీంతో ఏడాది కాలంగా రుణాలు అందడంలేదు. టెంట్ హౌస్‌లు, గొర్రెలు, గేదెలు, ఆవులు, కిరాణా దుకాణాలు పెట్టుకుని ఆర్థికంగా ఎదుగుదామనుకున్న గిరిపుత్రుల ఆశలు నిర్జీవమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్టీ జాతాపు, కొండదొర, ఎరుకల వంటి కులాలవారికి 60 శాతం, పీటీజీ గ్రామాల పరిధిలోని సవర, గదబ కులాల ప్రజలకు 90 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తుంది.
రికవరీయే సమస్య..
ట్రైకార్ రుణాల కింద లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్లు మందుకు రాకపోవడానికి రికవరీనే సమస్యగా చూపుతున్నారు. అప్పుగా ఇచ్చిన రుణాన్ని లబ్ధిదారుల నుంచి వసూలు చేయాలంటే బ్యాంకర్లకు చుక్కలు కనిపిస్తున్నాయని వాదిస్తున్నారు. దీనివల్లే ట్రైకార్ రుణ లక్ష్యాలు చేరుకోలేకపోతున్నామని చెబుతున్నారు.
రుణాలు అందజేయడం లేదు..
ప్రభుత్వం ప్రస్తుతం ఏ రకమైన రుణాలు మంజూరు చేయడం లేదు. దరఖాస్తు చేసి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం, బ్యాంకర్ల నుంచి ఎలాంటి రుణ సమాచారం అందలేదు. నిరుద్యోగులకు ఆసరాగా ఉండాల్సిన ప్రభుత్వం రుణాలను మంజూరు చేయడంలో చిత్తశుద్ధి చూపించడం లేదు. రెండేళ్లుగా రణాలకోసం ఎదురు చూస్తున్నా ఇంతవరకు రుణం మంజూరు కాలేదు.
– డప్పుకోట అశోక్, తులసివలస