Andhra Pradesh Local Body Elections are Held by Schedule | షెడ్యూల్‌ ప్రకారమే ‘స్థానిక’ఎన్నికలు - Sakshi
Sakshi News home page

షెడ్యూల్‌ ప్రకారమే ‘స్థానిక’ ఎన్నికలు

Published Thu, Jan 9 2020 3:39 AM | Last Updated on Thu, Jan 9 2020 11:17 AM

Local Body Elections As per schedule - Sakshi

పిటిషనర్‌: రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు. కానీ అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం సరికాదు.
అడ్వొకేట్‌ జనరల్‌: రిజర్వేషన్లు 50 శాతం దాటుతుండటంపై దాఖలైన వ్యాజ్యాన్ని గతంలో ఇదే ధర్మాసనం కొట్టివేసింది. చట్టాన్ని అనుసరించే ప్రభుత్వం జీవో జారీ చేసింది.
హైకోర్టు: షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరగాల్సిందే. నిలిపివేసే ప్రసక్తే లేదు.

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ మంథాట సీతారామమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్‌ల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన పంచాయతీరాజ్‌ చట్టంలోని 9, 15, 152, 153, 180, 181 సెక్షన్లను సవాల్‌ చేస్తూ కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న జారీ చేసిన జీవో 176ని కూడా ఆయన సవాలు చేశారు. ఈ జీవోను సవాలు చేస్తూ మరో రెండు వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. వీటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 

బీసీలకు రిజర్వేషన్లు ప్రభుత్వ విచక్షణే
పిటిషనర్‌ ప్రతాప్‌రెడ్డి తరఫు న్యాయవాది ఎస్‌.ప్రణతి వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని కె.కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంలో తప్పులేదని, అయితే బీసీలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటాయన్నారు. ప్రభుత్వం శాస్త్రీయ అధ్యయనం, బీసీ జనాభా గణన లాంటి వాటిని తేల్చిన తరువాత రిజర్వేషన్లు కల్పిస్తే అభ్యంతరం లేదని నివేదించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం సరికాదన్నారు. గతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కూడా రిజర్వేషన్లు 50 శాతానికి లోబడే ఎన్నికలు నిర్వహించాలని చెప్పిందన్నారు.

ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన తరువాత పూర్తిస్థాయి విచారణ జరుపుతామని పేర్కొంది. ఎన్నికలను నిలుపుదల చేసే ప్రసక్తే లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనికి ప్రణతి స్పందిస్తూ ఎన్నికలను ఆపాలని తాము కోరడం లేదని, కేవలం రిజర్వేషన్లు 50 శాతానికి మాత్రమే పరిమితం చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. జీవో 176ని సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని సుప్రీంకోర్టు చెప్పిన తరువాత అమలు చేసి తీరాల్సిందేనన్నారు. అయితే ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోందన్నారు. చట్ట ప్రకారమే ఇలా చేస్తున్నామని చెబుతోందని, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పంచాయితీరాజ్‌ చట్ట నిబంధనలు చెల్లవన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించేలా ఏవైనా చట్టాలు ఉంటే వాటిని సవరించుకోవాలని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ధర్మాసనానికి నివేదించారు. 

చట్ట ప్రకారమే రిజర్వేషన్లు...
రిజర్వేషన్లు 50 శాతం దాటుతుండటంపై ఇప్పటికే పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ఒక వ్యాజ్యాన్ని ఇదే ధర్మాసనం కొట్టి వేసిందని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ హైకోర్టుకు నివేదించారు. మరో వ్యాజ్యంలో ధర్మాసనం నోటీసులు జారీ చేసి, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిందన్నారు. చట్టాన్ని అనుసరించే జీవో 176 జారీ అయిందని తెలిపారు. ధర్మాసనం ఆదేశాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పిటిషనర్లు చివరి దశలో కోర్టుకు వచ్చారని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుంటే ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల తమ వ్యాజ్యాలు నిరర్థకమవుతాయని, ఈ విషయం కోర్టుకు తెలుసని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొనగా తమకు చాలా విషయాలు తెలుసని, స్థానిక సంస్థల గడువు ముగిసి ఏడాదిన్నర దాటినా కూడా ఎన్నికలు నిర్వహించని విషయం కూడా తమకు తెలుసని ధర్మాసనం ఒకింత ఘాటుగా వ్యాఖ్యానిస్తూ దీనిపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement