స్థానిక సమరానికి సై
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: స్థానిక ఎన్నికల సమరానికి సైరన్ మోగింది. నోటిఫికేషన్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంగోపాల్ సోమవారం విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21వ తేదీన నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 6,8 తేదీల్లో పోలింగ్, 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జెడ్పీటీసీ స్థానాలకు చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరం వద్ద, ఎంపీటీసీలకు ఆయా మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఐదు నామినేషన్లు దాఖలు
జెడ్పీటీసీ స్థానాలకు తొలిరోజు ఐదు నామినేషన్లు దాఖల య్యాయి. ఇందులో పాలసముద్రం మండలానికి టీడీపీ నుంచి బి.చిట్టిబాబు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. విజయపురానికి ఎం.సుశీల, ఎస్.సుప్రజ కాంగ్రెస్ పార్టీ తరఫున చెరొక నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే మదనపల్లెకు సీఆర్.విజయకుమార్ టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిప్రకాష్‌రెడ్డి, సహాయ రిటర్నింగ్ అధికారులు గోపీనాథ్, నిర్మల్ నిత్యానంద్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.
ఎంపీటీసీలకు అరకొరగా నామినేషన్లు
జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలకు సోమవారం పెద్దగా నామినేషన్లు దాఖలు కాలేదు. జిల్లావ్యాప్తంగా 901 ఎంపీటీసీ స్థానాలు ఉండగా తొలి రోజున 14 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇందులో వైఎస్సార్‌సీపీ తరఫున మదనపల్లె, చిన్నగొట్టిగల్లు మండలాల్లో ఒకటి చొప్పున, కలకడ రెండు నామినేషన్లు దాఖలు కాగా, కాంగ్రెస్ పార్టీ తరఫున బంగారుపాళెం, తిరుపతి, వి.కోట , భారతీయ జనతాపార్టీ (బీజేపీ) తరఫున కురబలకోటలో 1, నాగలాపురంలో 2, స్వతంత్ర అభ్యర్థులుగా యాదమరి, గుర్రంకొండ, బీ.ఎన్. కండ్రిగ, టీడీపీ తరఫున పెద్దతిప్పసముద్రంలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.
భారీ బందోబస్తు...
చిత్తూరులోని జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రాంతం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్తూరు డీఎస్పీ కమలాకరరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు అల్లాబక్షు, రాజశేఖర్, షాదిక్‌అలీలతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, 35 మంది సిబ్బంది, నాలుగు సీఆర్‌పీఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సీఈవో వేణుగోపాలరెడ్డి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ తదితర అంశాలను పర్యవేక్షించారు.