
గీతం ఇస్తేనే జీతం
- ప్రభుత్వ ఉద్యోగులను జలగల్లా పీలుస్తున్న చీరాల సబ్‌ట్రెజరీ అధికారులు
- పర్సంటేజీలివ్వనిదే బిల్లులు పాస్‌చేయని వైనం
చీరాల, న్యూస్‌లైన్ : ‘తాడిని తన్నేవాడు ఒకడైతే.. వాడి తల తన్నేవాడు మరొకడు’... అన్నచందంగా ఉంది చీరాలలో ప్రభుత్వ ఉద్యోగులు.. సబ్‌ట్రెజరీ అధికారుల పరిస్థితి. లంచం లేనిదే ఒక్క పనీచేయని ప్రభుత్వ ఉద్యోగుల వద్దే లంచాలు తీసుకుంటున్నారు స్థానిక సబ్‌ట్రెజరీ అధికారులు. పర్సంటేజీలివ్వనిదే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఇతర బిల్లులు పాస్‌చేయకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నిత్యం లంచాలు వసూలు చేయడం ఇక్కడి సబ్‌ట్రెజరీ అధికారులకు పరిపాటిగా మారింది. ఇప్పటి వరకూ పెన్షన్ల నుంచి కాంట్రాక్టర్ల బిల్లులు, పంచాయతీల బిల్లుల్లో పర్సంటేజీల చొప్పున డబ్బు వసూలు చేస్తున్న సబ్‌ట్రెజరీ అధికారులు.. తాజాగా ఉద్యోగులను సైతం వదలడం లేదు.
చీరాల సబ్‌ట్రెజరీ కార్యాలయం పరిధిలో చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు, పర్చూరు, ఇంకొల్లు మండలాలున్నాయి. ఆయా మండలాల్లోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు తమ పరిధిలోకి రావడంతో చీరాల సబ్‌ట్రెజరీ కార్యాలయం అధికారులు, సిబ్బందికి కాసుల పంటగా మారింది. అంగన్‌వాడీలు మొదలుకుని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల వరకూ ప్రతిఒక్కరి నుంచి ప్రతిపనికీ పర్సంటేజీలు లేనిదే బిల్లు చేయడంలేదు. వారు అడిగినంతా ఇవ్వకుంటే ఏదోక వంకతో బిల్లులు పాస్ చేయకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు.
నాలుగు నెలల క్రితం పంచాయతీరాజ్‌శాఖలో పంచాయతీ సెక్రటరీలుగా పలువురు అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు. చీరాలతో పాటు జిల్లాలోని అన్ని సబ్‌ట్రెజరీ కార్యాలయాల అధికారులు వీరిని కూడా వదిలిపెట్టలేదు. మీకు జీతాలిస్తాం సరే.. మా గీతం సంగతేంటి..? అని బేరసారాలకు దిగారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి తమకు కేటాయించిన గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలు చేస్తున్నారు.
వీరికి బేసిక్ జీతంగా రూ.8,440, ఇతర భత్యాలు, అలవెన్సులతో కలిపి రూ.16,000 వస్తుంది. రెగ్యులర్ ఉద్యోగుల కింద వీరికి జీతాలు విడుదల కావడంతో సబ్‌ట్రెజరీ అధికారులు ఒక్కో పంచాయతీ కార్యదర్శి నుంచి మొదటి నెలలోనే రూ.2000 తీసుకున్నారు. ముందు అకౌంట్ తెరవాలంటూ వెయ్యి రూపాయల మామూలు తీసుకున్న ట్రెజరీ అధికారులు.. అనంతరం జీతాలు ఇచ్చేందుకు మరో వెయ్యి రూపాయలు ఇవ్వాలని పట్టుబట్టారు. మొదటిసారిగా వస్తున్న జీతంలో కూడా మామూళ్లు ఇవ్వాల్సి రావడంతో ఆ పంచాయతీల కార్యదర్శులంతా సబ్‌ట్రెజరీ అధికారుల తీరును చూసి విస్మయం వ్యక్తం చేశారు.
పనిచేసినందుకు జీతం తీసుకోవాలంటే కూడా రూ.2000 ఇవ్వాల్సి రావడంతో తీవ్ర ఆవేదన చెందారు. కానీ, చేసేది లేక ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ నెలకు రూ.2000 చొప్పున రెండు నెలల పాటు చెల్లించి జీతాలు తీసుకున్నారు. చీరాల సబ్‌ట్రెజరీ కార్యాలయంలో ఇలాంటి అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. పంచాయతీ బిల్లులకు సంబంధించి ఈ కార్యాలయంలో భారీగా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో పంచాయతీ నిధులకు ఫ్రీజింగ్ ఉండటంతో మంజూరైన నిధులు మొత్తం ఇవ్వడానికి వీలుండేది కాదు. ప్రస్తుతం ఫ్రీజింగ్ లేకపోవడంతో మొత్తం నిధులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో సబ్‌ట్రెజరీ అధికారుల మామూళ్ల వ్యవహారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారింది. ఈ పరిస్థితిలో మార్పు కోసం ఏం చేయాలో అర్థంగాక ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు.