అక్కా.. పండుగెట్లా!
- అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు వేతనాల్లేవ్
- పెండింగ్‌లో ఆగస్టు, సెప్టెంబర్ బిల్లులు
- రూ. 2 కోట్లు మంజూరైనా ఆర్థికశాఖ నుంచి రాని అనుమతి
- ఆందోళన చేసినా సమయానికి అందని జీతాలు
ఇందూరు : రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ నెల వేతనాన్ని 27వ తేదీన అందజేసింది. కరువు భత్యం కూడా మంజూరు చేసింది. అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు, లింక్ వర్కర్‌లకు మా త్రం వేతనాలు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసింది. జిల్లా లో మొత్తం 2400కు పైగా అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 2,410 మంది కార్యకర్తలు, రెండు వేల మంది ఆయాలు పని చేస్తున్నారు. కార్యకర్తలకు రూ.4,200, ఆయాకు రూ.2,950 చొప్పున ప్రభుత్వం వేతనాలను ఇస్తోంది. అయితే, రెండు నెలలుగా వీరికి వేతనాలు రావడం లేదు. పండుగ నేపథ్యం లో పెండింగ్ వేతనాల కోసం అంగన్‌వాడీ ఉద్యోగులు 15 రోజుల క్రితం జి ల్లావ్యాప్తంగా అందోళనలు, ధర్నాలు ని ర్వహించారు. వేతనాలు,ఇతర బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాం డ్ చేశారు.
నిధుల కోసం విన్నవించినా
జిల్లాలోని 10 ప్రాజెక్టులకు కలిపి రూ.10 కోట్ల వరకు అవసరం ఉందని, వాటిని వెంటనే మంజూరు చేయాలని ఐసీడీఎస్ పీడీ రాములు డెరైక్టర్ అమ్రపాలి కాట ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు. కానీ, ప్రభుత్వం గత నెల 24న రూ.2,01,89,114 మాత్రమే విడుదల చేసింది. ఈ నిధులు అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు ఏమాత్రం సరిపోవని ఐసీడీఎస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిధులకు కూడా ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించలేదు. దీంతో పండుగ సమయానికి వస్తాయనుకున్న వేతనాలకు బ్రేక్ పడింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించి, నిధులు డీడీఓ ఖాతాలోకి, అక్కడి నుంచి ఉద్యోగుల ఖాతాలోకి రావాలంటే దాదాపు వారం నుంచి పది రోజుల సమయం పట్టవచ్చని అధికారులు భా విస్తున్నారు. ప్రభుత్వం తమపై వివక్ష చూపడం సరి కాదంటూ కేవలం అంగన్‌వాడీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు, సర్వేలకు ముందుంచి పని చే యించుకుంటున్న ప్రభుత్వం ఈ విధం గా పండుగ పూట పస్తులుంచడం తగదంటున్నారు.
లింక్ వర్కర్‌ల పరిస్థితి మరీ దారుణం
అంగన్‌వాడీ కార్యకర్తలకు చేదోడు వాదోడుగా ఉండేందుకు నియమించిన లింక్ వర్కర్‌ల పరిస్థితి మరీ దయనీ యంగా మారింది. నెలనెలా ఇచ్చే వేతనం రూ.750 కూడా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 600 మంది లింక్ వర్కర్‌లు పని చేస్తున్నారు.
ఆర్థిక శాఖ అనుమతి ఇస్తే బాగుండేది
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, లింక్ వర్కర్‌లకు రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. డిసెంబర్ వరకు వేతనాలు, ఇతర బిల్లులు ఇచ్చేందుకు జిల్లాకు దాదాపు రూ.10 కోట్లు కావాలి. వెంటనే నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. రూ.2,01,89,114 మాత్రమే విడుదల చేసింది. వీటికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది.
-రాములు, ఐసీడీఎస్ పీడీ