అదనపు విధులతో అవస్థలు
► రెండురకాల పనులతో అంగన్‌వాడీలకు ఇబ్బందులు
లక్ష్మణచాంద : మండలంలోని వివిధ గ్రామాలలోని అంగన్ వాడీ కేంద్రాలలో ఆయాలు లేకపోవడంతో కార్యకర్తలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.మండలంలో17 గ్రామ పంచాయతీలు 23 గ్రామాలు ఉండగా వాటిలో మొత్తం 44 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేవలం 28 అంగన్ వాడి కేంద్రాలకు మాత్రమే ఆయాలు ఉన్నారు. మిగతా 16 అంగన్ వాడీ కేంద్రాలకు ఆయాలు లేరు. దీంతో ఆయాలు లేని అంగన్ వాడీ కేంద్రాలలో కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చామన్ పెల్లి, కూచన్ పెల్లి, బోరిగాం, నర్సాపూర్, కనకాపూర్, కాశిగూడా, ధర్మారం, రాచాపూర్, లక్ష్మణచాంద1,4,5, మొదలగు గ్రామాలలో ఆయాలు లేకపోవడంతో కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రెండు రకాల విధులతో ఇబ్బందులు
మండలంలోని 12 గ్రామాల అంగన్ వాడీ కేంద్రాలకు ఆయాలు లేరు. దీంతో విధులు నిర్వహించటం తలనొప్పిగా తయారైంది. కేంద్రాలలో ప్రీ ప్రైమరి స్కూల్ కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాల్సిన అంగన్ వాడీ కార్యకర్తలు ఆయాలు లేకపోవడంతో వంటచేయడం , వడ్డించటం, పౌష్టికాహారం పంపిణిచేయడం, చిన్నారులను కేంద్రాలకు తీసుకురావండం, వారిని మళ్లీఇంటికి పంపించడం, కేంద్రాలను శుభ్రం చేయడం వంటి ఆయా విధులు కూడా నిర్వహిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎదురవుతున్న సమస్యలు
అంగన్ వాడీ కేంద్రాలలో ఆయాలు లేక పోవడంతో ఆయలు చేసే కార్యక్రమాలను కార్యకర్తలు చేయడంతో ప్రీ స్కూల్ కార్యక్రమాల సంబంధించిన షెడ్యూల్ నిర్వహణలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రీ స్కూల్ కార్యక్రమాలతో పాటు 15 రకాల రికార్డులు రాయటం, సెక్టార్ సమావేశాలకు, ప్రాజెక్టు సమావేశాలకు హాజరు కావలసిన అవసరం ఉంటుంది. ఇట్టి సమావేశాలకు హాజరైన సందర్భాలలో అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుంది.
ప్రభుత్వ పథకాల ప్రచారంలో
అసలే చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న వీరు చేస్తున్న పనులు చాలనట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ప్రచారంలోను, సర్వేలలోను భాగస్వాములను చేయటంతో మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా మారింది. ఇన్ని రకాల విధులు నిర్వహిస్తున్న కారణంగా చిన్నారుల ప్రీ విద్యపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇవే కాకుండా చిన్నారులకు వేసే టీకాలు ఇప్పించడం, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సలహాల కోసం నిర్వహించే ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం వంటి విధులు కూడా నిర్వహిస్తున్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మండలంలో ఖాళీగా ఉన్న ఆయాల పోస్టులను భర్తీ చేయాలని అంగన్ వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.