సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 42 పార్లమెంట్ స్థానాలు, 294 అసెంబ్లీ సీట్లకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశలో ఏప్రిల్ 30న తెలంగాణ జిల్లాల్లోని 17 పార్లమెంట్ స్థానాలకు, వాటి పరిధిలోని 119 అసెంబ్లీ స్థానాలకు; రెండో దశలో మే 7వ తేదీన సీమాంధ్ర జిల్లాల్లోని 25 పార్లమెంట్ స్థానాలకు, వాటి పరిధిలో గల 175 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతుంది. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) భన్వర్‌లాల్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
* ఏప్రిల్ 30న పోలింగ్ జరిగే స్థానాలకు ఏప్రిల్ 2న నోటిఫికేషన్ జారీ. అప్పటి నుంచి ఏప్రిల్ 9 వరకు నామినేషన్లు స్వీకరణ. 10న నామినేషన్ల పరిశీలన, 12తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.
* తొలి దశలో ఏప్రిల్ 30న పోలింగ్ జరిగే 17 పార్లమెంట్ స్థానాల పేర్లు: ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం (ఈ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా అదే రోజు పోలింగ్ జరుగుతుంది).
* రెండో దశలో మే 7న పోలింగ్ జరిగే 25 పార్లమెంట్ స్థానాల పేర్లు: కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందుపూర్, కడప, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు, అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి (ఈ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా అదే రోజు ఎన్నికలు జరుగుతాయి).
* మే 7న పోలింగ్ జరిగే స్థానాలకు ఏప్రిల్ 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అప్పటి నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 23తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.
* రాష్ట్రంలో మొత్తం 6.24 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో తెలంగాణ జిల్లాల్లో 2.70 కోట్ల మంది ఉండగా, సీమాంధ్ర జిల్లాల్లో 3.54 కోట్ల మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 69,014 పోలింగ్ కేద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశాతంగా, స్వేచ్ఛగా పోలింగ్ నిర్వహణకు 457 కేంద్ర సాయుధ బలగాలు కావాలని ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపారు.
* ఎన్నికల ఏర్పాట్లపై గురువారం అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ, నగర పోలీసు కమిషనర్లతో సీఈఓ భన్వర్‌లాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తారు.
* రాష్ట్రంలో కొత్తగా 76 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. వారందరికీ ఈ నెలాఖరు నుంచి కలర్ ఫొటోలతో స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తారు. పాత ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నవారు కొత్తగా స్మార్ట్ కార్డు పొందాలంటే ఏప్రిల్ 1 నుంచి ఈ-సేవలో రూ.25 చెల్లించి పొందవచ్చు.