బతుకు భయాన్ని పోగొడ్తా.. భరోసా ఇస్తా..
ఖమ్మం, న్యూస్‌లైన్:పుట్టిన బిడ్డకు సరైన చదువు లేక.. యువతకు ఉపాధి లేక దేశంలో ప్రజలు అనుక్షణం భయం భయంగా బతుకు బండిని ఈడుస్తున్నారని, తమ పార్టీకి అవకాశం కల్పిస్తే ఆ భయాన్ని పోగొడ్తానని, భరోసా ఇస్తానని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అన్నారు. శనివారం ఖమ్మంనగరంలో నిర్వహించిన ‘లోక్‌సత్తా శంఖారావం’ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఒక్క స్థానంతో అసెంబ్లీలోకి ప్రవేశించిన తమ పార్టీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు మూలస్తంభంగా మారిందన్నారు. పంటల ఎగుమతులు, సహకార రంగానికి స్వయం ప్రతిపత్తి కల్పన, మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు వంటి చట్టాల తీసుకురావడంతో కీలక భూమిక పోషిం చిందని అన్నారు. రాష్ట్రంలో 70లక్షల మందికి పైగా మద్యానికి బానిసలుగా మారి కుటుం బాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు అవకాశం ఇస్తే అద్భుతాలు చేస్తానని, రాష్ట్రంలో మద్యం దుకాణాలు లేకుండా చేస్తామని అన్నారు. బెల్ట్‌షాపులు, కాపుసారాను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకొస్తామని చెప్పారు. అదేవిధంగా మద్యానికి బానిసలుగా మారిన వారికి డీ-ఎడిషన్ చికిత్సను ఉచితంగా చేస్తామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా కుటుంబ రాజకీయాలు పోవడం లేదని అన్నారు. ఐదవ తరం నాయకుడు ప్రధాని పదవికోసం చూస్తున్నాడని రాహుల్‌గాంధీని విమర్శించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్‌టీ రామారావు టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు కుటుంబ రాజకీయాలకోసం తహతహలాడుతున్నాడని విమర్శిం చారు. మాటలు, మంత్రాలు కాకుండా రాష్ట్రం లో పుట్టిన ప్రతీ బిడ్డకు కలెక్టర్ కొడుకుతో సమానంగా చదివే విద్యావకాశాలు, యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని అప్పుడే పేదరికం సమసిపోతుందని అన్నారు. విద్యుత్ కొరతను నివారించేందుకు మోడల్‌గా సబ్‌స్టేషన్‌ను తీసుకొని చూపించామని, దీనిని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోగా, అమలు చేసిన గుజరాత్ దేశంలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు.
పాల ఉత్పత్తుల్లో అద్భుతాలు సృష్టించిన కురియన్ నాయకు స్పూర్తి ప్రధాత అని కొనియాడారు. మహిళలపై దాడులు పెరగడం విచారకరం అన్నారు. అయితే వాటిని నివారించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. ఆకతాయిలకు ఒకటి రెండు రోజుల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, మానసిక పరివర్తన వచ్చే విధంగా శిక్షలు ఉం డాలని అన్నారు. రైతులు పండించిన పంటల కు గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతుంటే ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలని ప్రభుత్వానికి సూచించానని, దీంతో రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని అన్నారు. ఖమ్మం నియోజకవర్గం లోక్‌సత్తా పార్టీ అభ్యర్థి రవిమారుత్ మాట్లాడుతూ నోట్లతో ఓట్లను కొనుగోలు చేసి సంస్కృతికి చరమగీతం పాడాలంటే లోక్‌సత్తాకు ఓటు వేయాలని అన్నారు. ఈ బహిరంగసభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కటారు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకులు భద్రునాయక్ పాల్గొన్నారు.