సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తలపెట్టిన సైకిల్ యాత్రకు బ్రేక్ పడింది. రాష్ట్ర విభజన అంకం చివరి దశకు చేరుకున్న తరుణంలో లోకేష్ యాత్ర చేపడితే ఇబ్బందులు తప్పవని గ్రహించిన ఆ పార్టీ జిల్లా నేతలు.. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి యాత్రను రద్దు చేయించినట్లు తెలిసింది. లోక్‌సభలో తెలంగాణ బిల్లు పెట్టడం.. ఆ తర్వాత జరిగిన ఘటనల నేపథ్యంలో సీమాంధ్ర అట్టుడుకుతోంది. ‘సమైక్య’ సెగ గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది.
రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తున్న తరుణంలో సమైక్యవాదులు ఆ పార్టీ నేతలపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ సైకిల్ యాత్ర చేపడితే చేదు అనుభవాలు ఎదురవుతాయని ఆ పార్టీ నేతలు గ్రహించారు. యాత్రకు మద్దతిచ్చే వారు సైతం కరువయ్యే ప్రమాదం ఉంది. పైగా సైకిల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు తప్పవనే సంకేతాలు రావడంతో దాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, నాయకులంతా లోకేష్ యాత్ర వెంట వెళ్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని కొందరు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి యాత్రను రద్దు చేయించినట్లు సమాచారం.
విభజన విషయంలో లేఖ ఇచ్చి చంద్రబాబు తప్పు చేశారన్న భావన సమైక్యవాదుల్లో పాతుకుపోయింది. సమైక్య ఉద్యమంలో టీడీపీ నేతలు పాల్గొంటున్నా ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరు. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న జిల్లా టీడీపీ నేతలు ఈనెల 16న హిందూపురం నుంచి ప్రారంభం కావాల్సిన సైకిల్ యాత్రను వాయిదా వేయించారు.
గుర్రుగా ఉన్న అబ్దుల్ ఘనీ
తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా హిందూపురం నియోజకవర్గం నుంచి మొదలు పెట్టడం ఆనవాయితీ. రానున్న ఎన్నికల్లో హిందూపురం నియోకవర్గం టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనికి ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో కొంతకాలంగా ఆయన జిల్లా నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. దీనికి బలం చేకూరేలా లోకేష్ యాత్ర గురించి తనకు కనీసం మాటమాత్రమైనా చెప్పలేదని ఇటీవల ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారధి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆ పార్టీలో నాయకుల మధ్య టికెట్ల కొట్లాట జరుగుతోంది. ఆశించిన వారికి టికెట్ రాకుంటే ఆ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో చేయి కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని టీడీపీ నాయకులే అంటున్నారు.
ఇలాంటి పరిస్థితిలో లోకేష్ యాత్ర చేపట్టడం వల్ల పార్టీకి ప్రయోజనం ఉండదని జిల్లా నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే యాత్రకు తా త్కాలికంగా బ్రేక్ వేయించింది. ఇదిలావుంగా సైకిల్ యాత్ర వాయిదా పడడంపై కొంత మంది నాయకులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే సైకిల్ యాత్రకు పెద్ద ఎత్తున్న సైకిళ్లను తీసుకొచ్చే బాధ్యతను కొంతమంది నేతలకు అప్పగించారు. అయితే అన్ని సైకిళ్లను ఎక్కడి నుంచి తీసుకురావాలని అనుకుంటున్న తరుణంలోనే యాత్ర వాయిదా పడడంతో వారంతా టెన్షన్ ఫ్రీ అయ్యారు.
లోకేష్ సైకిల్‌కు బ్రేక్
Published Sat, Feb 15 2014 1:52 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM
Advertisement
Advertisement