
'బాబు ప్రత్యేక విమానాలకా..పన్నులు చెల్లించేది'
► పెద్ద నోట్ల రద్దు చాలదు
► మళ్లీ పెద్ద నోట్లు తేవడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి
► బాబు క్యాంప్ కార్యాలయాన్ని 10 కోట్లతో వృధాగా అలకరించారు
► బాబు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడంపై జేపీ ఆగ్రహం
అమరావతి : అమరావతిలో ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయాన్ని రూ. 10 కోట్లతో వృధాగా అలకరించడం, ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం వంటి వాటి కోసమా ప్రజలు పన్నులు చెల్లించేది అని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. మోదీ సర్కార్ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుపై ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
చలామణీలో ఉన్న పెద్ద నోట్లను తక్షణం రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య నల్లధనాన్ని, నకిలీ నోట్లను నిరోధించడంలో ముందడుగేగానీ, మళ్లీ అవినీతి జరగకుండా చేస్తూ ప్రజలకు సమర్ధ పాలన అందించడానికి మాత్రం సరిపోదన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ రాజకీయ గిమ్మిక్కు మిగిలిపోకూడదంటే.. ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన, పన్నుల తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల పన్నుల డబ్బును నాయకుల విలాసాలకు, ఉద్యోగుల జీత భత్యాలు భారీ పెంపునకు కాకుండా ప్రజల సేవల కోసం సద్వినియోగం చేసే సంస్కరణను చేపట్టాలని సూచించారు.
జనన ధృవ పత్రం లాంటి ప్రభుత్వ సేవల కోసం గతి లేక లంచం ఇచ్చిన వారికి కూడా కారాగార శిక్ష విధించాలన్నారు. అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వ ఉద్యోగి మీద పోలీసు కేసు పెట్టాలన్నా అనుమతి కావాలని అవినీతి నిరోధక చట్టానికి ప్రతిపాదించిన దుర్మార్గపు సవరణల్ని మోదీ సర్కార్ ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. మోదీ సర్కార్ నిర్ణయంతో ప్రభుత్వానికి పన్నుల వసూళ్ల పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా పన్ను రేటు తగ్గింపునకు చర్యలు చేపట్టాలని జేపీ సూచించారు. చలామణీలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి, కొత్తగా రూ. 500, 2000 వంటి పెద్ద నోట్లు మళ్లీ తేవడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు.