
తిరుమలలో బారులు తీరిన భక్తులు
సర్వదర్శనానికి 25 గంటలు
బస్సుల్లో సీట్ల కోసం కొట్లాటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం అన్ని ప్రాంతాల్లో భక్తులు బారులు తీరారు. తిరుగుప్రయాణంలో బస్సుల్లో సీట్లకోసం భక్తులు ముష్టిఘాతాలకు దిగటంతో పలువురు గాయపడ్డారు. వరుస సెలవుల కారణంగా నాలుగురోజులుగా తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. సర్వదర్శనం, కాలిబాట దర్శనం, రూ. 300 టికెట్ల దర్శనం, అన్నదానం, కల్యాణ కట్టలు అన్ని చోట్లా క్యూలలో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. కిక్కిరిసిన క్యూలలో తీవ్రస్థాయి తోపులాటల మధ్య, గంటల తరబడి వేచి ఉంటూ తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పెరుగుతున్న రద్దీతో క్యూలను క్రమబద్ధీకరించటం ఆలయ అధికారులు, భద్రతా సిబ్బందికి సాధ్యం కాలేదు. సాయంత్రం 6 గంటలకు 31 కంపార్ట్‌మెంట్లలో నిండి వెలుపల మూడు కిలోమీటర్ల వరకు క్యూ కట్టారు. వీరికి దర్శన సమయం 25 గంటల తర్వాత కేటాయించారు. కాలిబాట క్యూ ఇదే స్థాయిలో ఉండగా, వీరికి దర్శనం 15 గంటలు పట్టింది. రద్దీ కారణంగా ఉదయమే రూ. 300 టికెట్ల క్యూలను మూసివేశారు. అప్పటికే క్యూలో ఉన్నవారికి 10 గంటల తర్వాత దర్శనం లభించింది.
రెట్టింపైన భక్తుల కష్టాలు
తిరుమలకు రావడం, గదులు, తలనీలాలు సమర్పించడం, స్వామి దర్శనం, లడ్డూలు.. ఇలా భక్తులు వరుసగా గంటల తరబడి క్యూలలో నిలబడి తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. లడ్డూల కోసం సుమారు రెండు కిలోమీటర్లు క్యూ కట్టారు. నాలుగు గంటలపాటు వేచి ఉండి కౌంటర్ వద్దకు చేరిన భక్తుడికి రెండే లడ్డూలు ఇవ్వడంతో తీవ్ర ఆవేదనతో తిరుగుముఖం పట్టారు.
నేడు తిరుమలలో శ్రీకష్ణ జన్మాష్టమి
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయంలోని బంగారు వాకిలిలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. మంగళవారం ఉట్లోత్సవం జరుగుతుంది. ఉట్లోత్సవాన్ని తిలకించేందుకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప ఆలయ పురవీధుల్లో ఊరేగనున్నారు. ఇందులో భాగంగా 19వ తేదీ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది