పింఛన్ కోసం పడిగాపులు
Published Thu, Oct 10 2013 3:23 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: మూడు నెలల నుంచి పింఛన్ పంపిణీ చేయక పోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ప్రొద్దుటూరులోని 40 వార్డులకు సంబంధించి వృద్ధాప్య, వికలాంగ, వితంతువు పింఛన్లు దాదాపు 12వేలకుపైగా ఉన్నాయి. దాదాపు 5 నెలల కిందటి వరకు 1, 5వ తేదీల్లోనే అన్ని వార్డులకు మున్సిపల్ సిబ్బంది వెళ్లి పంపిణీ చేసేవారు. అయితే స్మార్టు కార్డుల పేరుతో ప్రభుత్వం పింఛన్ పంపిణీని ఐసీఐసీఐ బ్యాంక్‌కు అప్పగించింది. వీరు స్వయం సహాయక సంఘాల ఆర్‌పీలకు ఒక రోజు శిక్షణ ఇచ్చి 40 వార్డులను 11 కేంద్రాలుగా కుదించారు. స్మార్టు కార్డు తీసుకునేందుకు కచ్చితంగా ఆధార్ కార్డు కావాలని, రేషన్ కార్డు కావాలని లింక్‌పెట్టారు. దీంతో గత 5 నెలలుగా లబ్ధిదారుల బాధలు వర్ణనాతీతం. ఒక్కో ఆర్‌పీ వందల మందికి పింఛన్ పంపిణీ చేయడం కష్టతరంగా మారింది. అయితే చాలామంది లబ్ధిదారుల పేర్లు స్మార్టు కార్డులో నమోదుకాలేదు.
పంపిణీ కేంద్రాల వద్దకు చక్కర్లు
ప్రతి నెల లబ్ధిదారులు చాలాసార్లు పింఛన్ కోసం పంపిణీ కేంద్రాల వద్దకు తిరుగుతున్నారు. పింఛన్ మొత్తం ఆటోలకే సరిపోతోందని వారు వాపోతున్నారు. మున్సిపల్ సిబ్బంది అయితే రెండు రోజుల్లోనే పంపిణీ చేసేవారు. ఇప్పుడు బ్యాంక్ సిబ్బంది రోజుకు ఎంత డబ్బు ఇస్తే అంత డబ్బే పంపిణీ చేయాలి. మిగిలిన వారు ఆ రోజు వెనక్కి వెళ్లిపోవాల్సిందే.
మూడు నెలలుగా...
ఆర్‌పీలు, ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మూడు నెలలుగా లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయలేదు. ఊరిలో లేకనో, ఆరోగ్యం బాగోలేకనో, ఎన్‌రోల్ లిస్టులో లేదనో, బతికి ఉన్నా చనిపోయినట్లు రికార్డుల్లో రాయడం వల్లనో వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా లబ్ధిదారుని పేరు తొలగిపోతుంది. ఈ విధంగా దాదాపు 30 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి బాధ, ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.
బతికున్నానని సర్టిఫికెట్ ఇవ్వండి...
బుధవారం మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ వద్దకు శ్రీనివాస్‌నగర్‌కు చెందిన ఎస్.నన్నేబీ అనే వృద్ధురాలు వచ్చింది. తన పింఛన్ పాస్ పుస్తకాన్ని చూపిస్తూ సారు ‘నాకు మూడు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. నేను బతికే ఉన్నానని కమిషనర్ వద్దకు వెళ్లి సర్టిఫికెట్ తీసుకు వస్తే ఇస్తానంటున్నారు’ అంటూ ఆవేదనతో చెప్పారు. బ్యాంక్ సిబ్బంది తీరుపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు రిపోర్టు రాస్తానని కమిషనర్ ఈ సందర్భంగా తెలిపారు.
నేను పంపిణీ చేయలేను...
ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపట్ల పింఛన్ పంపిణీ చేయాల్సిన ఆర్‌పీ సుభాషిని బుధవారం చేతులెత్తేసింది. ఇప్పటికే ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నా లిస్టులో లబ్ధిదారుల పేర్లు లేకపోవడం, తిరిగి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలని చెప్పడంతో తాను పంపిణీ చేయలేనని ఆమె వెళ్లిపోయిందని మున్సిపల్ ఆర్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement