కడప సెవెన్ రోడ్స్: అన్ని రంగాల్లో వెనుకబడిన రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ నేతలు నోరు విప్పి డిమాండ్ చేయాలని పలువురు వక్తలు కోరారు. రాయలసీమ రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో సమితి ప్రతినిధి డాక్టర్ ఓబుళ రెడ్డి అధ్యక్షతన కడపలో బుధవారం ఏర్పాటు చేసిన రౌంట్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు.
శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తితో నవ్యాంధ్ర రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని, కృష్ణా, గోదావరి జలాల పునః పంపిణీ జరగాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. దుమ్ముగూడెం-సాగర్ టెయిల్ పాండ్‌ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, రాయలసీమకు నికర జలాలు అందించాలని కోరారు. పునర్విభజన బిల్లులో ఇచ్చిన హామీ మేరకు కడపలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, కర్నూలులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నంద్యాలలో వ్యవసాయ విశ్వ విద్యాలయం, కడపలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
సమావేశంలో సమితి నాయకుడు బొజ్జ దశరథరామిరెడ్డి, జిల్లా పర్యాటక రంగ నిపుణుడు సిద్ధవటం సీతారామయ్య, చరిత్ర, భాషా పరిశోధకుడు విద్వాన్ కట్టా నరసింహులు, దళిత మహాజన ఫ్రంట్ కన్వీనర్ సంగటి మనోహర్, జనతాదళ్(యు) నాయకుడు యుగంధర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎఫ్ కన్వీనర్ భాస్కర్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చెంచురెడ్డి, జర్నలిస్ట్ జేఏసీ నాయకుడు రమణయ్య, కాంగ్రెస్ నాయకుడు అజయ్‌కుమార్ వీణా, బెరైడ్డి రామకృష్ణారెడ్డి, డి.సాల్మన్ పాల్గొన్నారు. సమావేశంలో నేతలు ఎవరెవరు ఏం మాట్లాడారో వారి మాటల్లోనే...
కర్నూలులో రాజధాని
కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలి. దీని వల్ల వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. సీమలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నవే. నికర జలాలు అందాలంటే గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మల్లించాలి. పోలవరం ఒక్కటే సరిపోదు. దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌ను నిర్మించాలి. దుమ్ముగూడెం నుంచి 70 వేల క్యూసెక్కులు నీరు వృథాగా వెళ్తున్నాయి. అందులో 24 వేల క్యూసెక్కులు కృష్ణా నదిలోకి మల్లిస్తే సీమకు నికర జలాలు అందుతాయి. రాష్ట్రాన్ని విభజించింది కేంద్రమే గనుక కేంద్రమే ప్రాజెక్టులకు నికర జలాలు, నిధులు ఇవ్వాలి.
- వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ మంత్రి
రెండో రాజధాని అవసరం
ప్రజల ఐక్యతకు ఉపయోగపడే ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయాలి. రాష్ట్రం కోస్తా, ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాలుగా కలసి ఉన్నాయి గనుక ఒక ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే, మిగిలిన ప్రాంతాల్లో రెండో రాజధాని ఏర్పాటు చేయాలి. రాజధానిని అభివృద్ధి చేయకుండా మిగిలిన అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలి. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, కర్నూలులో నిట్, కడపలో ఎయిమ్స్, ఇడుపులపాయలో త్రిపుల్ ఐటీ కేంద్రం ఏర్పాటు చేయాలి.
- డాక్టర్ గేయానంద్, ఎమ్మెల్సీ
భావితరాలు క్షమించవు
కోస్తా నాయకుల మాటలు నమ్మి ఇప్పటికే పలుసార్లు రాయలసీమ వాసులు మోసపోయారు. ఇప్పటికైనా అలసత్వం వీడి రాజధాని కోసం పోరాడకపోతే భావితరాలు క్షమించవు. ఆంధ్ర రాష్ట్రోద్యమంలో కోస్తా నాయకుల మాటలు నమ్మి కృష్ణా, పెన్నా ప్రాజెక్టులను కోల్పోయాం. వాటి స్థానంలో నాగార్జున సాగర్ వచ్చింది. ఆ తర్వాత రాజధాని కర్నూలును కోల్పోయాం. ఇప్పుడు రాజధానినైనా సాధించుకుంటే జరిగిన అన్యాయం కొంతైనా తీరుతుంది.
- మధుసూదన్‌రెడ్డి,
సీమ రాజధాని సాధన సమితి నాయకుడు
జాతీయ ప్రాజెక్టుగా దుమ్ముగూడెం
దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలి. లేదంటే రాయలసీమకు చుక్కనీరు అందదు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగులకు చేరుకుంటే ఎస్‌ఆర్‌బీసీకి తప్ప పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు నీటి విడుదల సాధ్యం కాదు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డులో అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర పునర్వ్వవస్థీకరణ బిల్లులో కోస్తా నాయకులు పోలవరం ప్రాజెక్టును చేర్పించారే తప్ప, దుమ్ముగూడెం, టెయిల్‌పాండ్‌ను చేర్పించలేదు. దుమ్ముగూడెం వల్ల ఎవరి ప్రయోజనాలు దెబ్బతినవు.
రాజధాని ఏర్పాటు అంశంపై శివరామకృష్ణన్ కమిటీ అసరమే లేదు. కోస్తా నాయకులు తెలివిగా రాష్ట్రం విడిపోతే రాజధానిపై కమిటీ ఏర్పాటు అంశాన్ని బిల్లులో చొప్పించగలిగారు. ఈ కుట్రలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి. రాజధాని, నికర జలాల అంశంపై సీమకు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలి.
- సి.హెచ్. చంద్రశేఖర్‌రెడ్డి, సీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు
రాజధానితో పాటు అభివృద్ధి
సీమకు రాజధానిని తీసుకురావడానికి ఓ వైపు కృషి చేస్తూనే, జిల్లాల అభివృద్ధిపైనా దృష్టి సారించాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. రాయలసీమకు నికర జలాలను సాధించుకోవాలి. అఖిలపక్షంగా ఏర్పాటై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లాలి. సీమ హక్కుల కోసం నేనూ మీతో కలసి వస్తా.
- శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నేత
కడపపై శీతకన్ను
కడపపై ప్రభుత్వ పెద్దలు శీతకన్ను పెట్టారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కావడంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ జిల్లా అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు. స్టీల్ ప్లాంట్‌కు బడ్జెట్‌లో నిధులు ఎందుకు కేటాయించలేకపోయారో స్పష్టం చేయాలి. ముఖ్యమంత్రి బాబు రాయలసీమ ప్రాంత వాసే కావడంతో ఇక్కడి సమస్యలన్నీ ఆయనకు తెలుసు. మరో ఆలోచనకు తావు లేకుండా రాయలసీమలో రాజధాని ఏర్పాటుకు సీఎం ముందుకు రావాలి.
- రవిశంకర్‌రెడ్డి, సీపీఎం నాయకుడు
రాజధాని కోసం నేతలు నోరు విప్పాలి
Published Thu, Jul 24 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement
Advertisement