లంకను రావణాసురుడు నాశనం చేసిన విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు తన దుష్ట ఆలోచనలతో రాష్ట్రాన్ని నాశనం చేశాడని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. గురువారం కోట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు లేఖ ఇస్తేనే సోనియాగాంధీ నిరంకుశంగా రాష్ట్రాన్ని విభజించారన్నారు.
విభజన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీదేనన్నారు. తెలుగుజాతిని విడగొట్టి బాబు, కిరణ్ చరిత్ర హీనులుగా మిగిలారన్నారు. ప్రజలంతా రోడ్డుమీదకు చేరి ఉద్యమం హోరెత్తుతున్న సమయంలోను ‘జైసమైక్యాంధ్ర’ అని ఒక్కసారి కూడా అనని బాబు ఏ ముఖం పెట్టుకుని తెలుగు ప్రజలను ఓట్లడుగుతారని ప్రశ్నించారు. ఈ రోజు టీడీపీ తోడుదొంగల పార్టీగా మారిందన్నారు. కాంగ్రెస్ నాయకులకు పిలిచి పార్టీలో చేర్చుకుంటున్న బాబును ప్రజలు ఎలా విశ్వసిస్తారన్నారు.
తొమ్మిదేళ్ల రాక్షసపాలనలో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన బాబు ఈనాడు రాష్ట్రాన్ని విభజించి సింగపూర్ చేస్తానంటూ వాగ్దానాలు చేస్తున్నాడన్నారు. ఎన్ని పిట్ట కథలు చెప్పినా ప్రజలు బాబును నమ్మరన్నారు. బీజేపీతో చెలిమికి ప్రయత్నిస్తున్న టీడీపీని ఆ పార్టీ నాయకులను ప్రజలు తరిమితరిమి కొట్టి బంగాళాఖాతంలో కలిపేసే రోజు వస్తుందన్నారు. ప్రజలు అమాయకులు కాదని తమ ప్రతాపాన్ని రానున్న ఎన్నికల్లో చూపిస్తారన్నారు. ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే చివరి వరకు సమైక్యవాదానికి కట్టుబడి పోరాడిందన్నారు. సీమాంధ్రకు కాబోయే తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు.
సీమాంధ్ర అభివృద్ధి జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని చెప్పారు. తెలంగాణలోనూ వైఎస్సార్‌సీపీ మెరుగైన స్థానాలు సాధిస్తుందన్నారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఇతర పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు పెరిగాయన్నారు. అందరితో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో తిన్నెలపూడి సొసైటీ అధ్యక్షుడు నల్లపరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ వినోద్‌కుమార్‌రెడ్డి, కోట సర్పంచ్ రాఘవయ్య, జగదీష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.