లారీని ఢీకొన్న వోల్వో బస్సు
ఒక్క సారిగా ధడేల్‌మన్న శబ్దం.. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు సీట్లలోంచి ఎగిరి పడ్డారు.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. గుండెలదురుతుండగా డ్రైవర్ వద్ద ఉన్న డోర్ నుంచి ఒకరిద్దరు కిందకు దూకారు.. మిగతా వారు వారిని అనుకరించారు.. కిందకు దిగి చూసిన ప్రయాణికుల్లో వణుకు మొదలైంది.. బస్సు ముందు భాగం తుక్కుతుక్కుగా మారింది.. ముగ్గురు విగత జీవులుగా కనిపించారు.
చిలమత్తూరు : చిలమత్తూరు మం డల పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున సిమెంటు లోడుతో వెళుతున్న లారీని ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... శుక్రవారం రాత్రి కేఏ-01 ఏఏ9877 నంబరు గల ఒమర్ (ప్రైవేట్ ట్రావెల్స్) వోల్వో బస్సు 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. శనివారం తెల్లవారుజామున కోడూరు తోపు- కొడికొండ చెక్‌పోస్టు మధ్యలో ఉన్న జువారి సీడ్‌స ఫ్యాక్టరీ సమీపంలో నిదానంగా వెళుతున్న సిమెంటు లారీని 15 మీటర్ల దూరంలో ఉండగా గమనించిన వోల్వో బస్సు డ్రైవర్ జలీల్‌ఖాన్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ముందు సీట్లల్లో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు బస్సు అద్దాలను పగులగొట్టుకుంటూ రోడ్డుపై పడిపోయారు. వెంటనే బస్సు వారిపై నుంచి దూసుకెళుతూ లారీని ఢీకొంది. వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ప్రయాణికుడు లారీ-బస్సుకు మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు వదిలాడు. మృతుల్లో బెంగళూరుకు చెందిన రాహుల్ అగర్వాల్ (30), హైదరాబాద్ నాంపల్లికి చెందిన బాబుపిళ్లై (34)తోపాటు మరొక ప్రయాణికుడు (హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన మద్దిశెట్టి వీరశేఖర్‌గా అనుమానం) ఉన్నారు. సడన్ బ్రేక్ వేసినపుడు కిందపడిపోయి ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
గాయపడిన వారు తమ లగేజీలను చేతపట్టుకుని డ్రైవర్ పక్కనుండే తలుపు ద్వారా కిందకు దిగారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎన్‌హెచ్ విభాగం వారు అంబులెన్‌సల ద్వారా క్షతగాత్రులను బాగేపల్లి, చిక్కబళ్లాపురం, బెంగళూరు ప్రాంతాలకు తరలించారు. ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్ బాషా తన సిబ్బందితో సంఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటికి తీయించి పోస్టుమార్టం కోసం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సంఘటన స్థలాన్ని డీఎస్పీ సుబ్బారావు పరిశీలించి.. టికెట్ల బుకింగ్ పుస్తకం ద్వారా ప్రయాణికుల వివరాలు తెలుసుకున్నారు. క్రేన్ల సహాయంతో వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తీయించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. హిందూపురం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి దారి తీసిన కారణాలను ఆరా తీశారు. ఒమర్ సంస్థ లీజుపై నడుపుతున్న ఈ వోల్వో బస్సు ధనుంజయ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. క్షతగాత్రుల్లో బెంగళూరుకు చెందిన విటుల్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ఫరీద్, రుత్విక్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు.
క్లీనర్ ప్రాణాలు కాపాడిన నిద్ర
‘ప్రమాదం జరిగే 10 నిమిషాల ముందు వరకు బస్సు డ్రైవర్ జలీల్ ఖాన్ దగ్గరే కూర్చున్నా. నిద్ర వస్తుండటంతో వెనుక ఖాళీగా ఉన్న సీటులో కూర్చుని నిద్రపోయాను. అదే నన్ను కాపాడింది. ఉన్నట్లుండి సడన్ బ్రేక్ వేయడంతో పెద్ద శబ్దంతో బస్సు ఆగిపోయింది. దాంతో బస్సులో ఉన్న వారందరూ సీట్లల్లోంచి కిందపడ్డారు. ఆ వెంటనే వారంతా డ్రైవర్ సీటు పక్క డోర్‌లోంచి కిందకు దిగేశారు’ అని క్లీనర్ జాకీర్ తెలిపాడు.
ముమ్మాటికీ డ్రైవర్ల నిర్లక్ష్యమే : డీఎస్పీ సుబ్బారావు
కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం ముమ్మాటికీ రెండు వాహనాల డ్రైవర్ల నిర్లక్షమే. సిమెంటు లోడుతో వెళుతున్న లారీకి వెనుకవైపు ఇండికేటర్లు లేవు. ఒక వేళ ఇండికేటర్ ఉంటే వోల్వో బస్సు డ్రైవర్ గుర్తించే అవకాశం ఉండేది.
ఘోరం..
Published Sun, Sep 7 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement