శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: దారిదోపిడీ చేసి డబ్బు దోచుకున్నారని నాటకం ఆడిన ఓ లారీ డ్రైవర్ చివరికి కటకటాలపాలయ్యాడు. అత్యాశతో డబ్బు కాజేయడానికి అతను వేసిన పథకం కాస్తా అడ్డం తిరిగింది. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు కేసు చేధించి నిందితుడిని రిమాండ్‌కు పంపారు. సీఐ శ్రీనివాస్ మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేరు గ్రామానికి చెందిన వనం లింగయ్య అలియాస్ లింగస్వామి(29)కి ఓ లారీ ఉంది.
అతనే సొంతంగా నడుపుకుంటూ నల్లగొండకు చెందిన పత్తి వ్యాపారి దాస్వామి వద్ద రెండేళ్లుగా నమ్మకంగా సరకు రవాణా చేస్తున్నాడు. ఈ క్రమంలో దాస్వామి నల్లగొండలో సేకరించిన 69 క్వింటాళ్ల పత్తిని లింగస్వామి లారీలో లోడ్ చేసి, మెదక్ జిల్లా సంగారెడ్డిలోని మంజిత్ కాటన్ మిల్లుకు పంపించాడు. లింగస్వామిపై నమ్మకం ఉండడంతో పత్తి అమ్మి డబ్బు తీసుకురమ్మని చెప్పాడు. ఈనెల 5న నల్లగొండ నుంచి వెళ్లిన లారీ సంగారెడ్డిలోని మిల్లు వద్ద పత్తిని అన్‌లోడ్ చేసింది. పత్తి అమ్మగా వచ్చిన రూ.3,08,180 తీసుకుని లింగస్వామి సోమవారం రాత్రి నల్లగొండకు బయలుదేరాడు.
దారి దోపిడీ జరిగిందంటూ..
ఒకేసారి అంత డబ్బు చూసే సరికి లింగస్వామి మనసు పక్కదారి మళ్లింది. డబ్బు కాజేయడానికి ఓ పథకాన్ని రచించాడు. మండలంలోని పెద్దగోల్కొండ సమీపంలో ఉన్న ఔటర్ రోటరీ వద్దకు రాగానే రాత్రి 11 గంటల సమయంలో లారీని ఆపాడు. లారీ ముందు భాగం అద్దాలను రాయితో పగలగొట్టి, తన షర్‌టను చించివేసుకున్నాడు. డబ్బు ను డీజిల్ ట్యాంకు పక్కన ఉన్న ఒక పెట్టెలో దాచి పెట్టాడు. తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు దారి దోపిడీ చేసి డబ్బు దోచుకున్నారని దాస్వామికి ఫోన్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న దాస్వామి అదేరోజు రాత్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. లారీ డ్రైవర్‌పై అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించ గా నేరం అంగీకరించాడు. దీంతో అతని నుంచి డబ్బు ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ న ర్సింహ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
డామిట్ కథ అడ్డం తిరిగింది
Published Tue, Jan 7 2014 11:52 PM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement