లారీ ఢీకొని వివాహిత మృతి
Published Thu, Sep 12 2013 4:06 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
తూములూరు(తెనాలిటౌన్),న్యూస్‌లైన్ : ఇసుక లోడుతో అతివేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న టీవీఎస్ మోపెడ్‌ను ఢీకొనడంతో దానిపై ప్రయాణిస్తున్న వివాహిత మృతి చెందింది. మరో యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన కొల్లిపర మండలం తూములూరు శివారు నాగరాజుపాలెం సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
తూములూరుకు చెందిన శొంటి వెంకటేశ్వరమ్మ (27), తన తమ్ముడు మోర్ల శివరామకృష్ణతో కలిసి నాగరాజుపాలెం సెంటర్ నుంచి తూములూరు గ్రామానికి టీవీఎస్ మోపెడ్‌పై వెళ్తున్నారు. ఈపూరు నుంచి ఇసుక లోడ్‌తో వ స్తున్న లారీ నాగరాజుపాలెం టర్నింగ్ వద్ద ఎదురుగా వస్తున్న టీవీఎస్‌ను ఢీకొనడంతో శివరామకృష్ణ పక్కకు దూకాడు. టీవీఎస్‌పై వెనుక కూర్చున వెంకటేశ్వరమ్మ తల మీదకు లారీ వెనుక టైర్ ఎక్కడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో శివరామకృష్ణకు స్వల్పగాయాలు కాగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
విషయం తెలుసుకుని మృతురాలి బంధువులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. కొల్లిపర ఎస్‌ఐ కె.ప్రభాకర్‌రావు అక్కడకు వచ్చి ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Advertisement
Advertisement