నెల్లూరు (రెవెన్యూ) : నెల్లూరు జిల్లాకు రాబోయే రెండెళ్లల్లో భారీ పరిశ్రమలు రానున్నాయని, వచ్చే నెలలో క్రిబ్‌కో, కంటైనర్ పరిశ్రమలు ప్రారంభం కానున్నాయని జాయింట్ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో జేసీ విలేకరులతో మాట్లాడారు. క్రిబ్‌కో, కంటైనర్ల పరిశ్రమలకు వెంకటాచలం, టీపీగూడూరు మండలాల్లో భూములు కేటాయించామన్నారు. నెల్లూరు రూరల్ మండలంలో 2019లో జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన క్రీడా మైదానాల నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు.
జిల్లాలో ఐటీ పార్క్, ఫుడ్ పార్క్‌లు, ఆటో మొబైల్ హబ్‌లు రానున్నాయని వెల్లడించారు. టీవీఎస్, జీవీకే, రుచి ఆయిల్ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయన్నారు. ఏర్పేడు- నాయుడుపేట మధ్య భారీ పరిశ్రమ ఏర్పాటు కానుందన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములు గుర్తించమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. జిల్లాలో 1,192 గ్రామాల్లో ప్రత్యేక సర్వేలు నిర్వహించామన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన 45 వేల ఎకరాల ప్రభుత్వ భూములు గుర్తించామన్నారు. అనేక భూములు ఆక్రమణల్లో ఉన్నాయన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించి పరిశ్రమలు స్థాపనకు భూములు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రాడార్ కేంద్రానికి 72 ఎకరాలు కేటాయింపు
జిల్లాలో పొదలకూరు మండలం మరుపూరు వద్ద రాడార్ కేంద్రం ఏర్పాటుకు 72 ఎకరాల భూములు కేటాయించామన్నారు. భారత వాయుసేన కేంద్రం ఏర్పాటుకు సన్నద్ధమయిందన్నారు. దీని వల్ల జిల్లా శాస్త్ర, సాంకేతిక పరంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు
జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జేసీ తెలిపారు. కలెక్టరేట్ ద్వారా నిరుద్యోగులకు వివిధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత గుర్తించి వారికి బహుళ జాతి కంపెనీల పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
పుట్టంరాజువారికండ్రిగలో పనులు వేగవంతం
రాజ్యసభ సభ్యుడు సచిన్‌టెండూల్కర్ దత్తత తీసుకున్న పుట్టంరాజువారికండ్రిగలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టమన్నారు. నిధులు విడుదలలో జాప్యం జరగడం వల్ల పనులు ఆలస్యమయ్యాయన్నారు.
జిల్లాలో భారీ పరిశ్రమలు
Published Wed, Feb 4 2015 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement