ఒక లవ్ మ్యారేజి.. నాలుగు హత్యలు! | love marriage leads to four murders | Sakshi
Sakshi News home page

ఒక లవ్ మ్యారేజి.. నాలుగు హత్యలు!

Published Fri, Apr 24 2015 8:05 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

ఒక లవ్ మ్యారేజి.. నాలుగు హత్యలు!

ఒక లవ్ మ్యారేజి.. నాలుగు హత్యలు!

(సాక్షి వెబ్ ప్రత్యేకం)

ప్రశాంతమైన గ్రామం అది.. పచ్చటి పంట పొలాలతో అలరారుతుండేది. అలాంటి గ్రామంలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక లవ్ మ్యారేజి.. నాలుగు హత్యలకు, మరికొన్ని హత్యాయత్నాలకు కారణమైంది. అది పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామం. విజయవాడ సమీపంలో జాతీయరహదారి మీద ఢిల్లీ నుంచి వచ్చిన కిరాయి హంతకులు కాల్పులు జరిపి ముగ్గురి ప్రాణాలు బలిగొన్నా.. హైదరాబాద్ జింకలబావి సమీపంలో జ్యోతిష్యుడు తురపాటి నాగరాజుపై కాల్పులు జరిగి.. అతడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా.. అన్నింటికీ పినకడిమి గ్రామంలో కొన్నేళ్ల క్రితం జరిగిన లవ్ మ్యారేజే కారణం. ఈ గ్రామం జిల్లా కేంద్రం ఏలూరుకు కూతవేటు దూరంలోనే ఉంటుంది. అవ్వడానికి చిన్నదే అయినా.. అక్కడ ఇళ్లు చాలావరకు పెద్దపెద్ద బంగ్లాల్లా కనిపిస్తాయి. అందుకు కారణం.. అక్కడి జంగాలు. జ్యోతిష్యాన్ని వృత్తిగా చేసుకున్న జంగాలు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెద్దపెద్ద వాళ్లకు జాతకాలు చెబుతుంటారు. విదేశాల్లో కూడా వీళ్లు పలువురు పెద్దలకు జాతకాలు చెప్పేవాళ్లు. అలా డబ్బు సంపాదించి ఇక్కడివాళ్లలో చాలామంది గొప్పవాళ్లయ్యారు. ఏలూరులోని కొన్ని హోటళ్లు కూడా పినకడిమి గ్రామస్థులవే.

ఈ గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం రెండు కుటుంబాల మధ్య ఓ లవ్ మ్యారేజి చిచ్చు రేపింది. భూతం గోవిందు కుమార్తెను తురపాటి నాగరాజు కుమారుడు శివకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది భూతం కుటుంబానికి ఇష్టం లేదు. కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. అవి అలా కొనసాగుతుండగానే.. గ్రామంలో ఈవెనింగ్ వాక్ కోసం వెళ్లిన భూతం దుర్గారావు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, కత్తులతో నరికి చంపారు. తురపాటి నాగరాజు కుటుంబమే ఈ హత్య చేయించిందని భూతం వర్గీయులు అనుమానించారు. ఈ ఘటన తర్వాత దుర్గారావు సోదరుడు భూతం గోవిందు లండన్ పరారైపోయాడు. మరో సోదరుడు శ్రీనివాసరావు మాత్రం ఇక్కడే ఉండి.. నాగరాజు కోసం గాలించడం మొదలుపెట్టాడు.

నాగరాజు, అతడి కొడుకులను కొన్నాళ్ల తర్వాత పోలీసులు అరెస్టు చేసినా, వాళ్లు అత్యంత నాటకీయంగా పోలీసు స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయారు. ఎక్కడున్నారన్న విషయం చాలాకాలం పాటు ఎవరికీ తెలియలేదు. దుర్గారావు హత్య కేసులో ఇతర నిందితులైన నాగరాజు బావమరిది గంధం నాగేశ్వరరావు, అతడి కొడుకులు పెదమారయ్య, చినమారయ్య ముంబైలో తలదాచుకున్నారు. అక్కడి నుంచి కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు వస్తుండగా.. కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి సమీపంలో జాతీయ రహదారిపై కాల్పులు జరిగి, వాళ్లు ముగ్గురూ మరణించారు. ఈ హత్యకు స్కెచ్ వేసింది లండన్లో ఉన్న భూతం గోవిందు కాగా, ఢిల్లీ నుంచి కాంట్రాక్టు కిల్లర్లకు సుపారీ ఇచ్చింది మాత్రం శ్రీనివాసరావు అని చెబుతారు.

తురపాటి నాగరాజు, అతడి కుమారులు ఎక్కడున్నారన్న విషయం చాలా కాలం పాటు ఎవరికీ తెలియలేదు. అయితే, ఇటీవలే ఏప్రిల్ ఒకటో తేదీన హైదరాబాద్ సరూర్నగర్ సమీపంలోని జింకలబావి ప్రాంతంలో ఒక ఇంట్లో ఉన్న నాగరాజుపై గుర్తుతెలియని వ్యక్తులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. వాటిలో మూడు నాగరాజుకు తగిలాయి. పొట్ట భాగంలో రెండు రౌండ్లు, తొడ భాగంలో ఒక రౌండు బుల్లెట్లు దిగాయి. అయితే నాగరాజు అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడినా, కోలుకున్న తర్వాత మాత్రం అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

భూతం, తురపాటి కుటుంబాలకు చెందినవాళ్లు అందరూ ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూనే కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఏ ఘటన జరిగినా వెంటనే అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, అంతా చక్కబడిన తర్వాత మాత్రమే తిరిగి గ్రామంలోకి రావడం మామూలైపోయింది. పెద అవుటపల్లి కాల్పులు జరిగిన తర్వాత ఒక్కసారిగా పినకడిమి గ్రామం ఉలిక్కిపడింది. అప్పటివరకు ఈ ఊరి గురించి తెలియని బాహ్య ప్రపంచానికి కూడా ఈ మొత్తం వ్యవహారం తెలిసింది. మొత్తానికి ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాను ఓ లవ్ మ్యారేజి అల్లకల్లోలం చేసింది.
-పి.ఆర్.ఆర్. కామేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement