బాలానగర్/ మహబూబ్‌నగర్ క్రైమ్, న్యూస్‌లైన్ : ఆ ఇద్దరూ ఒకే కళాశాలలో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని ఇరు కుటుంబ సభ్యులకు చెప్పగా కులాలు వేరుకావడంతో అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌లోని కొత్తగంజి వాసి శ్రీకాంత్ (22), వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ప్రియాంక (21) దేవ రకద్ర మండలం చౌదర్‌పల్లి సమీపంలోని శ్రీవిశ్వేశ్వరాయ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకోవడంతో పెళ్లి చేసుకుందామని ఇటీవల నిర్ణయించుకున్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది.
ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం బంధువులు అబ్బాయిని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో శనివారం సాయంత్రం అతను బైక్‌పై హైదరాబాద్ వెళుతున్నట్లు తల్లికి చెప్పి బయలుదేరాడు. ఇది తెలిసిన అమ్మాయి తానూ వస్తానని జడ్చర్ల వద్ద వేచి ఉండాలని తెలిపింది. ఆ మేరకు రాత్రి ఎనిమిది గంటలకు అక్కడ ఇద్దరూ కలుసుకున్నారు. జీవితంలో ఎలాగో కలిసి ఉండలేకపోతున్నామని మనస్తాపానికి గురై బాలానగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అదే అర్ధరాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఇది గమనించిన కీమన్ చందూలాల్ మహబూబ్‌నగర్ స్టేషన్‌మాస్టర్ పెద్దిరాజుకు సమాచారమిచ్చారు. ఆయన ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్‌ఐ హనుమప్ప కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
కడుపుకోతను మిగిల్చారు!
కొత్తగంజిలో నివాసముంటున్న శ్రీకాంత్ తల్లి జాండ్ర సుజాత ైటైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. కొన్నేళ్ల క్రితం భర్త శంకర్‌లింగం హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి ఆమె పెద్ద దిక్కుగా తనకున్న ఇద్దరు కొడుకులను చదివించింది. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. రెండో కుమారుడు శ్రీకాంత్ బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.
పియాంకను ప్రేమిస్తున్న విషయం ఇటీవల తెలియడంతో ఆ పెళ్లి వద్దని మందలించింది. చివరకు అతను ఆత్మహత్యకు పాల్పడటంతో షాక్ గురైన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రియాంక తండ్రి రామస్వామి గతంలోనే మృతి చెందాడు. దీంతో ఆమె తల్లి సంరక్షణలోనే ఉంటోంది. ఈ ఘటన ఇద్దరు తల్లులకు కడుపుకోతను మిగిల్చింది.
ప్రేమజంట ఆత్మహత్య
Published Mon, Oct 28 2013 2:50 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement