రోదిస్తున్న తల్లి స్వర్ణకుమారి (ఇన్‌సెట్‌లో) గ్లోరి(ఫైల్)
కరిగిన కల
Published Thu, Dec 29 2016 8:52 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
– తల్లి ఆశయాన్ని నెరవేర్చలేనని కుమార్తె ఆత్మహత్య
– నిప్పంటించుకొని పాలిటెక్నిక్ విద్యార్థి బలవన్మరణం
‘అమ్మా.. ఇంజినీరింగ్ చదివి నీ కల నెరవేర్చాలనుకున్నా. కానీ సరిగ్గా చదవలేకపోతున్నాను. సబ్జెక్టులు తప్పాను. మళ్లీ చదివినా పాసవుతాననే నమ్మకం కుదరడం లేదు. నీ కల నెరవేర్చనందుకు నన్ను క్షమించు’ అని కోరుతూ పాలిటెక్నిక్ విద్యార్థిని గ్లోరి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక ఎంఎస్ నగర్‌లో గురువారం ఈమె ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ రమణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. - నంద్యాల
స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయం వెనుక జోసెఫ్, స్వర్ణకుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. జోసఫ్ అనంతపురంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా స్వర్ణకుమారి స్థానింగా ప్రైవేట్ పాఠశాల టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి స్వర్ణ ప్రశాంతి, గ్లోరి కుమార్తెలు. ఇద్దరిని బాగా చదివించి ఇంజినీర్లను చేయాలని తల్లి కలలను కంది. ఇదే విషయాన్ని తరచూ గుర్తుచేస్తూ ప్రోత్సహించేది. పెద్ద కుమార్తె స్వర్ణ ప్రశాంతి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. చిన్న కుమార్తె గ్లోరి ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. రెండో సంవత్సరంలో కొన్ని సబ్జెక్టులు తప్పడంతో మానసిక వేదనకు గురైంది. వారం రోజులుగా తల్లితో ఇదే విషయం చెబుతూ బాధపడేది. ఈ క్రమంలో గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఫెయిల్ అయిన విషయాన్ని తనతో చెప్పి బాధపడినా ధైర్యం చెప్పానని ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతుందని ఊహించలేకపోయానని తల్లి రోధించింది. త్రీటౌన్ ఇన్‌చార్జి ఎస్‌ఐ రమణ, ఏఎస్‌ఐ కృష్ణుడు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
Advertisement