
సహజీవనానికి నిరాకరించిందని యువతిపై దాడి
గుంటూరు: తనతో సహజీవనం చేయడానికి నిరాకరించిందని యువతిపై ప్రేమాన్మాది దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు పట్టణంలోని నల్ల చెరువు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లచెరువులోని 8వ లైన్‌కు చెందిన కె.లక్ష్మి, చెందేటి వేణుగోపాల్ ఇద్దరూ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. వీరు 10వ తరగతి నుంచీ కలసి చదువుకుంటున్నారు. దీంతో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆరు నెలల క్రితం వీరిద్దరూ శ్రీనివాసరావు తోటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేయడం ప్రారంభించారు. అయితే, వేణుగోపాల్‌కు గతంలోనే పెళ్లి అయినట్లు తెలియడంతో లక్ష్మి గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది.
ఈ నేపథ్యంలో వేణుగోపాల్ శుక్రవారం తెల్లవారు జామున నల్లచెరువులోని లక్ష్మి ఇంటికి వచ్చాడు. డాబాపై నిద్రిస్తున్న లక్ష్మి దగ్గరకు వెళ్లి కలసి ఉందామని, తిరిగి తనతో రావాలని కోరాడు. ఆమె కాదనడంతో కత్తితో దాడి చేసి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతడిని దొంగగా భావించిన స్థానికుడు అబ్దుల్ రఫీ పట్టుకునే ప్రయత్నం చేయగా వేణుగోపాల్ అతడిపై కూడా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. గాయపడిన లక్ష్మి, రఫీలను వెంటనే చికిత్స నిమిత్తం స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.