
ప్రియురాలిని పంపించాల్సిందే
► మృతదేహంతో బంధువుల ఆందోళన
► ఆరిలోవ పోలీస్‌స్టేషన్ ఎదుట మూడు గంటలపాటు ఉద్రిక్తం
ఆరిలోవ : ‘‘ప్రియురాలి చేతిలో మోసపోవడం వల్లే పార్థసారథి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి చివరి కోరిక మేరకు ప్రియురాలి సమక్షంలోనే దహన సంస్కారాలు నిర్వహిస్తాం. పోలీసుల అదుపులో ఉన్న యువతిని మా వెంట పంపించండి’’... అంటూ ఆరిలోవ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుని బంధువులు మంగళవారం సాయంత్రం ఆందోళన చేశారు. వందలాది మంది స్థానికులు స్టేషన్‌ను ముట్టడించడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. చివరకు ఆరిలోవ పోలీసులతో పాటు తూర్పు ఏసీపీ రమణబాబు, పీఎం పాలెం, ఆనందపురం సీఐలు, ఎస్‌లు, సిబ్బంది రావాల్సి వచ్చింది.
అయినప్పటికీ మూడు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... పెదవాల్తేరు ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయిన ఆరిలోవ ప్రాంతం పాండురంగాపురానికి చెందిన యలమల పార్థసారథి(24) సోమవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. తన మృతికి ప్రేమ వైఫల్యమే కారణమని, ప్రేమించిన అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయించి రూ 1.50 లక్షలు తీసుకొని మోసం చేసిందని, దానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంటున్నట్లు సూసైడ్ లేఖలో రాశాడు. నా మృతదేహాన్ని ప్రేమించిన అమ్మాయి సమక్షంలో దహనం చేయాలని కోరుతూ ఆ లేఖలో రాశాడు. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు మంగళవారం ఆ ఆమ్మాయిని అదుపులోకి తీసుకొని ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.
అదుపు చేయలేకపోయిన పోలీసులు : పోస్టుమార్టం అనంతరం మృతదే హాన్ని దహన సంస్కారాల కోసం మృతుడి బంధువులు, స్థానికులు ఆరిలోవ తీసుకొస్తూ పోలీస్ స్టేషన్ ముందు మృతదే హం ఉన్న వ్యాన్‌ను నిలిపేశారు. స్టేషన్‌లో ఉన్న ఆ అమ్మాయిని దహన సంస్కారాల వద్దకు తీసుకెళ్తామని, మాతో ఆ అమ్మాయిని పంపించాలని పోలీసులను కోరారు. పోలీసులు ససేమిరా అనడంతో ఆందోళనకు దిగారు. అధిక సంఖ్యలో మృతుడి బంధువులు రావడంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. దీంతో సీఐ ధనుంజయనాయుడు ఇచ్చిన సమాచారంతో ఈస్ట్ ఏసీపీ రమణబాబు, పీఎంపాలెం, ఆనందపురం సీఐలు అప్పలరాజు, పార్థసార థి, ఎస్.ఐలు, కానిస్టేబుళ్లు సుమారు 100 మంది వరకు స్టేషన్‌కు చేరుకొన్నారు.
అయినా స్టేషన్ నుంచి ఆందోళనకారులు వెళ్లలేదు. రాత్రి కావడంతో మృతదేహానికి దహన సంస్కారాలు జరపలేదు. బంధువులు మాట్లాడుతూ పార్థసారథిని ప్రేమించిన అమ్మాయిని పంపిస్తేనే మృతదేహానికి దహనసంస్కారాలు చేస్తామని భీష్మించారు. దీంతో ఏసీపీ రమణబాబు మృతుడి బంధువులను పిలిచి స్టేషన్ లోపల మాట్లాడారు. మృతుడికి తగిన న్యాయం చేస్తామని, ముందు దహన సంస్కారాలు జరిపించండని నచ్చజెప్పారు. శాంతించిన మృతుడి బంధువులు స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకొన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి స్టేషన్ ముందు సాగిన ఈ డ్రామా సుమారు రాత్రి 9 గంటలకు సద్దుమనిగింది.
మృతుడికి పుట్టినరోజు : ఇదిలా ఉండగా మృతుడు పార్థసారథికి మంగళవారం పుట్టిన రోజు కావడం విశేషం. మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ ముందు నిలిపి మృతుడి స్నేహితులు, బంధువులు కేక్ కట్‌చేశారు. స్టేషన్‌లో ఉన్న పార్థసారథి ప్రియురాలిని పోలీసులు బయటకు తీసుకురావాలని నినాదాలు చేశారు. ఎంతో సరదాగా పుట్టిన రోజు చేసుకోవాల్సిన రోజే అంత్యక్రియలు జరపాల్సి వస్తోందంటూ మృతుడి పిన్ని కనకదుర్గ స్టేషన్ వద్ద బోరున విలపించింది.