వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ వివాహాలయ్యాయి. ఇద్దరేసి పిల్లలు కూడా ఉన్నారు. అతనికి భార్యతోను, ఆమెకు భర్తతోను విభేదాలు వచ్చాయి. ఆమె పుట్టిల్లు.. అతని సొంతిల్లు ఆ గ్రామంలోని ఒకే ప్రాంతం. దీంతో తమ జీవిత భాగస్వాములకు దూరంగా ఉన్న వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇది వారి కుటుంబాలకు తెలిసింది. ఇద్దరిపై ఒత్తిడి పెరిగింది. వారు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
పశ్చిమగోదావరి : ఉంగుటూరులో నంద్యాల సురేష్, తణుకు ఉమాసరోజిని కలిసి ఒకే చున్నీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం వేకువ జామున వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగుటూరు కోనేరుపేటకు చెందిన నంద్యాల సురేష్(27)కు కైకరానికి చెందిన నాగలక్ష్మితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అదే పేటకు చెందిన జొన్నాడ ఉమాసరోజిని(23)కి తణుకు మండలం కాయలపాడుకు చెందిన తణుకు సుబ్బారావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సురేష్ తన భార్యతో గొడవల నేపథ్యంలో ఒంటరిగా ఉంటున్నాడు. సరోజిని తన భర్తతో ఉన్న స్పర్థలతో కొన్ని నెలలుగా ఉంగుటూరులోని పుట్టింట్లో ఉంటోంది. వారిద్దరిది కోనేరు పేట కావటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఇది తెలిసి రెండు కుటుంబాల నుంచి వీరిపై ఒత్తిడి వచ్చింది. దీంతో సురేష్, సరోజిని కలిసి మూడు రోజుల క్రితం గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఏమైందో కానీ వారిద్దరు ఉంగుటూరు కోనేరుపేట వచ్చారు. ఏలూరు కాలువ గట్టు వద్ద వినాయక ఆలయం సమీపంలోని పూరిపాకలో ఒకే చున్నీతో ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో పానీ పూరీ, వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి. ఈ విషయం తెలిసి వీఆర్వో పీతల ముత్యాలు శుక్రవారం ఉదయం చేబ్రోలు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్సై తాడి వెంకటనాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి వచ్చి చలించి పోయారు.
సురేష్ తల్లి వేదన: ఎప్పుడు అమ్మా అమ్మా అంటూ వెంట ఉండే కుమారుడు సురేష్ మృతితో అతని తల్లి గుండెలవిసేలా రోదించింది. అతని తండ్రి ఏడుకొండలు ఆవేదనతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు.
కలలో కూడా అనుకోలేదు
కుమారై మృతదేహం చూసి ఆమె తండ్రి జొన్నాడ చిన్ననాగేశ్వరరావు బోరున విలపించారు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని మృతదేహం వద్ద ఆమె తల్లి వెంకటరమణ, తండ్రి నాగేశ్వరరావు గుండెలు బాదుకుంటూ విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment