నేడు ప్రేమికుల రోజు | lovers day | Sakshi
Sakshi News home page

నేడు ప్రేమికుల రోజు

Published Sat, Feb 14 2015 1:55 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

lovers day

నిజమైన ప్రేమ చావదు...
 కడప అర్బన్ : ప్రేమ రెండు హృదయాలను కలుపుతుంది. కానీ, నేటి రోజుల్లో ఆకర్షణనే ప్రేమగా భావిస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో ఆరాటపడి తమ పిల్లలను పెంచి పెద్దచేసి తమ ఆశయాలను సాధిస్తారని భావిస్తే...వారి ఆశయాలను ఆకర్షణ పేరుతో తుంచేసి తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.
 
 గత సంవత్సరం....
 ఊ జనవరి 20వ తేదిన ప్రొద్దుటూరుకు చెందిన మైనర్ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 ఊ ఫిబ్రవరి 7వ తేదిన నందలూరుకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రేమించిన వ్యక్తి పెళ్లికి ఒప్పుకోలేదని ఆత్మహత్యకు పాల్పడింది. అదే నెలలో 4వ తేదిన పులివెందులకు చెందిన మైనర్ విద్యార్థి ప్రేమించిన అమ్మాయి ప్రేమకు ఒప్పుకోలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 ఊ మార్చి 3న రైల్వేకోడూరుకు చెందిన ఓ మైనర్ బాలికను ఓ వ్యక్తి తాను ప్రేమించానంటూ పెళ్లి చేసుకుని ప్రస్తుతం కట్నం కోసం ఆమెను వేధిస్తున్నాడు. ఊ ఏప్రిల్ 23న సిద్దవటంకు చెందిన ఓ ప్రేమజంట ఇంటినుంచి వెళ్లిపోయారు. తర్వాత తమ ప్రేమ విఫలమై ఇంటికి తిరిగి వచ్చారు.
 
 ఊ సెప్టెంబరు 17న ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తన ప్రేమ విఫలమైందని కళాశాలలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేనెలలో 21న మైనర్ బాలిక వేరే యువకుడితో స్నేహంగా తిరుగుతుంటే తల్లిదండ్రులు ఆ అమ్మాయి చేస్తున్నది తప్పని చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడింది.
 ఊ 2012లో రాయచోటికి చెందిన ఈశ్వర్‌రెడ్డి, సావిత్రి తన ఇద్దరు కుమార్తెలను కుమారుల మాదిరిగా కంటికి రెప్పలా చూసుకున్నారు. వారికి మంచి చదువులు చెప్పించారు.పెద్ద కుమార్తె ప్రేమ పేరుతో ప్రేమించిన వాడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. తర్వాత చిన్న కుమార్తెపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆమె కూడా ప్రేమ పేరుతో ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.
 గెలిచి చూపించండి...
 నిజమైన ప్రేమ ఎప్పటికీ చావదు...యుక్త వయస్సు వచ్చిన యువతీ యువకులు తమ ప్రేమ నిజమని తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుంటే అందరూ మెచ్చుకుంటారు. తర్వాత తాము ఆపదలో ఉన్నా కూడా తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉంటుంది.
 
 అలాగని తల్లిదండ్రులను మోసం చేసి తమ దారి తాము చూసుకునేందుకు చేసే ప్రయత్నంలో ఆత్మహత్యలకు పాల్పడే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన  మదిలోనికి రానీయకుండా...ఒకవేళ అలా వస్తే మీకు చాలా ఆప్తులైన వారితో మాట్లాడాలి.   మీ మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న వారి గురించి ఆలోచించండి. ఎన్నో కష్టాలను గట్టెక్కి జీవితంలో విజేతలుగా నిలిచిన వారి జీవితగాథలు చదవండి. ఆదర్శంగా నిలవండి.   
 
 
 కులాలు వేరైనా..
 మా కులాలు వేరైనా.. 20 ఏళ్లుగా ప్రేమతో అన్యోన్యంగా జీవిస్తున్నాం.  విద్యను అభ్యసిస్తున్న తరుణంలోనే మా మధ్య ప్రేమ చిగురించింది. మాపెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అయినా ఇద్దరం ఒక్కటిగా కష్ట, నష్టాలను పంచుకొని జీవిస్తున్నాం. మాకు ఇద్దరు పిల్లలు తేజేశ్, జ్ఞానప్రసూన. వారిద్దరినీ చక్కగా చదివించుకుంటున్నాం. నేను అంగన్‌వాడీ కార్యకర్తగా, నా భర్త సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఎన్నటికీ మా మధ్య కులాల భేదాలు రాలేదు. ఉన్నంతలో హాయిగా ప్రేమ జీవితం కొనసాగిస్తున్నాం. నా భర్త   ప్రేమను ఆదర్శంగా తీసుకొని.. ప్రేమ వివాహాలు చేసుకొన్న వారికి అండగా నిలిచి.. చేయూత నిస్తున్నారు.
 -సూరేపల్లె శ్రీనివాసులు, శ్రీదేవి, రాజంపేట
 
 ప్రేమంటే బాధ్యత..
 కడప కల్చరల్ : ప్రేమ రెండక్షరాలే. ప్రేమ అంటే ఆకర్షణ కాదు.. అవగాహన ఉండాలి. ముఖ్యంగా ప్రేమంటే పెద్ద బాధ్యత అని  ప్రముఖ సైకాలజిస్ట్ ఒ.వెంకటేశ్వరరెడ్డి అన్నారు.  ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సంద ర్భంగా ఆయన ఇంటర్వ్యూ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం.
 
 సాక్షి : ప్రేమంటే ఏమిటి?
 ఓవీ రెడ్డి : మాటలు చాలవు...ఎవరి అనుభూతి వారిది.
 సాక్షి : ఏ వయస్సు వారిది నిజమైన ప్రేమ?
 ఓవీ రెడ్డి : దీనికి వయోభేదం లేదు.
 సాక్షి : ప్రేమించమని బలవంతం పెట్టడం, కత్తులతో దాడులు, మోసం చేయడం, ప్రేమ వివాహాల్లోనూ విడాకులు? లోపం ఎక్కడుంది?
 ఓవీ రెడ్డి : అవగాహన లోపమే అరాచకాలకు కారణం. ఆకర్షణనే ప్రేమ అని భావిస్తున్న అమాయకత్వం.
 సాక్షి : నిజమైన ప్రేమను గుర్తించడం ఎలా?
 ఓవీ రెడ్డి : ఆకర్షణలో మోహం, ఉద్వేగం, పగటి కలలు కనడం, ఏకాగ్రత లోపం ఉంటాయి. వ్యక్తిని కాకుండా ప్రేమ భావాన్ని మాత్రమే ఇష్టపడతారు. ఏదో ఘనత సాధించినట్లు ఊహాల్లోనే ఉండిపోతారు. అదో రకమైన భ్రమాన్విత మనోమయ ప్రణయోన్మాదంతో నిండిపోతారు. అందానికే విలువనిస్తారు. శరీరంపైనే ఆకర్షణ. నిజమైన ప్రేమికుల్లో భ్రమ, స్వార్థం ఉండవు. పరవశానికి లోనైనా మిగతా వారి భావోద్వేగాలకూ విలువనిస్తారు. అవగాహనతో నడుచుకుంటారు. శారీరక ఆకర్షణకు ప్రాధన్యమివ్వరు. దాపరికరాలు ఉండవు. చెడును కూడా పంచుకోవడానికి సిద్ధమవుతారు. ప్రేమంటే సరదాలే కాదు...జీవితాన్ని నడిపే బాధ్యత అని భావిస్తారు.
 
 సాక్షి : మన జిల్లాలో ప్రేమ విషాదాలున్నాయా?
 ఓవీ రెడ్డి : ఈ ఆరు నెలల్లోనే అలాంటి 20 సంఘటనలు జరిగాయి. ఇందులో విజయాలకంటే వైఫల్యాలే ఎక్కువ. అందుకే ప్రేమ పట్ల నేటికీ సమాజంలో గౌరవం లేదు.
 
 సాక్షి : టేనేజీ ప్రేమికులకు మీ సందేశం ఏమిటి?
 ఓవీ రెడ్డి : ప్రేమంటే యువతీ యువకుల శరీర ఆకర్షణే కాదు...జీవితంలో అంతకుమించిన బాధ్యతలు ఉన్నాయి. వాటిని నెరవేర్చగల శక్తి సంపాదించాకే ఈ వ్యవహారంలోకి దిగాలి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, నేస్తాలు, దేశం పట్ల కూడా అదేస్థాయి ప్రేమను చూపాలి. అప్పుడే ఉత్తమ పౌరడనిపించుకుంటాం.
 
  వ్యాపారం.. అదుర్‌‌స..
 
 ప్రేమికుల దినోత్సవ సందర్భంగా గ్రీటింగ్స్ తదితర వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. గతం కంటే పాతికశాతం కొనుగోలు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నా కేవలం గ్రీటింగ్ కార్డులకు సంబంధించి జిల్లా అంతటా రూ. 50 వేలకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. వాటితోపాటు మగ్గులు, చాక్లెట్లు, రిస్ట్ బ్యాండ్స్, కీ చైన్లు, లాకెట్లు, ఇలా దాదాపు 20 రకాల వస్తువులను యువతీ యువకులు కొంటున్నారు.  
 
 కడప కల్చరల్ : వైఎస్సార్‌జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన పేదింటి యువకుడు రాజేష్ (పేరు మార్చాము) హైదరాబాదులో  నాల్గవ సంవత్సరం ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మూడవ సంవత్సరంలో ఫేస్‌బుక్ ద్వారా ప్రకాశం జిల్లాకు చెందిన హైదరాబాదులోని మరో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న శ్రావణి (పేరు మార్చాము) పరిచయం అయింది.
 
 నేరుగా కలుసుకున్నారు. కబుర్లు, షికార్లు అయ్యాయి. తల్లిదండ్రులు పంపుతున్న డబ్బుతో అరకొర వసతులతో ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ బ్రిలియంట్‌గా చదువు సాగిస్తున్న రాజేష్ ప్రేమలో పడ్డ తర్వాత అప్పులు చేయడం ఎక్కువైంది. కళాశాలకు వెళ్లడం బాగా తగ్గింది. కళాశాలలో సహ విద్యార్థులకు, అధ్యాపకులకు విషయం తెలిసి కొందరు ఆత్మీయంగా మందలించారు. మరికొందరు లక్కీఫెలో అంటూ ప్రోత్సహించారు.
 
  అకస్మాత్తుగా ఓసారి స్నేహితుడు అతని గదికి వెళ్లగా, అపస్మారక స్థితిలో ఉన్న రాజేష్ కనిపించాడు. ఇతర స్నేహితుల సహకారంతో ఆస్పత్రిలో చేర్చారు. రాజేష్ కాస్త తేరుకున్నాక జరిగిన దానికి కారణమేమిటని అడిగాడు. తన ప్రేమికురాలు తనను మోసం చేసిందని, ఆమెకు తనకంటే ధనికులైన మరో ఇద్దరు ప్రేమికులున్నారని, తాను పేద వాడినని తెలుసుకున్న ఆమె మూడు రోజుల క్రితం తనకు గుడ్‌బై చెప్పిందన్నారు. ప్రేమకు పేదరికం ఏమిటని, తాను నిజాయితీగా ప్రేమించానని, ఆమెకోసం ఇటీవల దాదాపు రూ. 2 లక్షలు అప్పు చేసి జల్సాగా తిప్పానని వాపోయాడు.  
 
 స్నేహితుడు రాజేష్‌ను ఓదార్చి అతని ప్రియురాలు శ్రావణి చిరునామా తీసుకుని వెళ్లి కలి శాడు. మొదట్లో తాను రాజేష్‌ను నిజాయితీగా ప్రేమించానని, కానీ తనలా మధ్య తరగతి కుటుంబాని కంటే పేదవాడైన రాజేష్‌ను పెళ్లాడి తానేం సుఖ పడతానని ఆమె ప్రశ్నించింది. భర్తను ఎన్నుకునే హక్కు తనకు ఉందని, తన పరిశీల నలోని ఉత్తమం అనిపించిన వాడినే చేసుకుంటానని స్పష్టంగా చెప్పింది. రాజేష్ అనారోగ్య స్థితి గురించి చెప్పి కన్విన్స్ చేయాలని ప్రయత్నించినా అంత మానసిక బలహీనుడిని చేసుకుని తానేం సుఖ పడతానని నిలదీసింది. నిజానికి అతనికి కూడా తానుగాక మరో రెండు, మూడు ఎఫైర్స్ ఉన్నాయని, వారు రాసుకున్న ఉత్తరాలను తెచ్చి చూపింది. పోలీసు కంప్లైట్ ఇవ్వకుండా వదిలి పెడుతున్నానని హెచ్చరించింది. విషయాన్ని తన మిత్రుడు రాజేష్‌కు తెలి పాడు.  సైకాలజిస్ట్ ఓవీఆర్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించగా రాజేష్ దారిన పడ్డాడు. ప్రస్తుతం బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. శ్రావణి కూడా వివాహమై భర్తతో హాయిగానే ఉంది.
 
  ప్రేమ...మోసం  
 బ్రిలియంట్‌గా చదువు సాగిస్తున్న రాజేష్ ప్రేమలో పడ్డాడు. కళాశాలకు వెళ్లడం తగ్గించాడు.  సహ విద్యార్థులకు, అధ్యాపకులకు విషయం తెలిసి మందలించారు. మరికొందరు లక్కీఫెలో అంటూ ప్రోత్సహించారు. అకస్మాత్తుగా ఓసారి స్నేహితుడు అతని గదికి వెళ్లగా, అపస్మారక స్థితిలో ఉన్న రాజేష్ కనిపించాడు. ఆస్పత్రిలో చేర్చారు. రాజేష్ కాస్త తేరుకున్నాక  కారణమేమిటని అడిగితే  ప్రేమికురాలు మోసం చేసిందని చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement