ప్రకాశం జిల్లా గిద్దలూరులో వర్షపు నీటిలో మునిగిన కార్లు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడం, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగానూ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమ, కోస్తాంధ్ర మొత్తం విస్తరించాయని, దీనివల్లే బుధవారం నుంచి విస్తారంగా వానలు కురుస్తున్నాయని ఐఎండీ అమరావతి కేంద్రం సంచాలకులు స్టెల్లా గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. గురువారం దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని, రాబోయే 36 గంటల్లో తెలంగాణకు నైరుతి విస్తరిస్తుందని ఐఎండీ పేర్కొంది. నైరుతి రుతుపవనాలతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వేసవి తాపాన్నుంచి ప్రజలు ఊరట చెందారు. కాగా, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది.
కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో చెరువును తలపిస్తున్న పంట పొలాలు
ఉత్తరాంధ్రలో భారీ వర్షం
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. రణస్థలం మండలం జె.ఆర్.పురం ఎస్సీ కాలనీలో పిడుగుపడి భవిరి నర్సింహులు (64) అనే వృద్ధుడు మృతి చెందాడు. భామిని మండలం దిమ్మిడిజోలలో పిడుగులు పెద్దఎత్తున పడ్డాయి. విజయనగరం జిల్లాలోని విజయనగరం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, గంట్యాడ మండలాల్లో భారీ వర్షం పడింది. కాగా పలు మండలాల్లో చిరుజల్లులు కురిశాయి.
చెరువుల్లా పంటపొలాలు
కర్నూలు జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీగా వర్షం పడింది. నంద్యాలలో అత్యధికంగా 98.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఒకే రోజు జిల్లా మొత్తం మీద 25.2 మి.మీ. వర్షపాతం నమోదు కావడం విశేషం. పలు ప్రాంతాల్లో పంట పొలాలు చెరువులను తలపించాయి.
కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
ప్రకాశం జిల్లాలో బుధ, గురువారాల్లో జోరు వాన కురిసింది. ఏళ్ల తరబడి నీటి జాడ తెలియని వాగులు సైతం జలకళతో కళకళలాడుతున్నాయి. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కుండపోత వర్షం కురిసింది. గిద్దలూరు ప్రాంతంలోని ఎర్రవాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు ఉధృతికి గుంటూరు–దొనకొండ రైల్వే ట్రాక్ కింద భాగం మొత్తం కొట్టుకొని పోయింది. బేస్తవారిపేట మండలం జగ్గంబొట్ల కృష్ణాపురం, రాచర్ల మండలం సోమిదేవిపల్లి గ్రామాల మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో ఆ లైన్‌లో నడిచే అన్ని రైళ్లను రద్దు చేసి మరమ్మతులు చేపట్టారు. సగిలేరు పొంగి పొర్లుతోంది. 15 చెరువులు నిండుకుండల్లా మారాయి. వర్షానికి పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది.
గుంటూరు జిల్లాలో మోస్తరు వాన
గుంటూరు జిల్లాలో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సగటున 2.39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భట్టిప్రోలు తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. పాతగుంటూరు పరిధిలోని ముగ్దుం నగర్‌లో వృద్ధురాలు మెహరున్నీసా (85) వర్షం వల్ల పెంకుటిల్లు కూలటంతో మృతిచెందింది. ఆమె కుమార్తె రిహానాకు గాయాలు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment