వచ్చే 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయవ్యంగా ప్రయాణించి బుధవారం తుపానుగా మారనుంది. తర్వాత కూడా అదే దిశలో ప్రయాణిస్తూ శ్రీలంక తీరానికి ఆనుకుని ప్రయాణించి.. ఈ నెల 29న నాటికి ఉత్తర తమిళనాడు వైపు రానుంది. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
ఈ నెల 29, 30 తేదీల్లో రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్న దృష్ట్యా డిసెంబర్ 1వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు. తీవ్ర వాయుగుండం మంగళవారం రాత్రి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో, నాగపటా్ననికి దక్షిణ–ఆగ్నేయంగా 710 కి.మీ., చెన్నైకి దక్షిణ–ఆగ్నేయంగా 800 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపానుగా మారిన తర్వాత దానికి ‘ఫెంగల్’ అని పేరు పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment