గుంటూరు, సాక్షి: భానుడి భగభగలతో.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో.. ఉక్కపోతలతో అల్లలాడిపోతున్న ఏపీ ప్రజలకు చల్లటి కబురు. వాతావరణంలో మార్పులతో రాబోయే మూడు నాలుగు రోజులు ఎండలు, వడగాలులు తగ్గు ముఖం పట్టనున్నాయి. అదే సమయంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి.
రేపటి నుంచి మూడు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, గుంటూరుతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.
అలాగే.. తీవ్ర ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తున్న కోస్తా, రాయలసీమ జిల్లాల పరిధిలోనూ రెండ్రోజులపాటు(7-9 తేదీల మధ్య) వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్ష ప్రభావంతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయంది. అలాగే మిగతా ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు పడనున్నాయి.
ఇదిలా ఉంటే.. ఆదివారం నంద్యాల జిల్లా మహానందిలో 45.8 డిగ్రీల సెల్సియస్, కర్నూలు జిల్లా సింగవరంలో 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment