సాక్షి, విశాఖపట్నం: ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాన్ని ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం నిలకడగా ఉంది. దీంతో రుతుపవనాలు కోస్తాంధ్ర, తెలంగాణపై చురుగ్గా ఉన్నాయి. మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణలో విస్తారంగాను, రాయలసీమలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో వర్షాలు ఆశాజనకంగానే ఉంటాయని, తర్వాత పెరిగే అవకాశాలున్నాయన్నారు. రుతుపవనాలు బలంగా ఉండటంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
బుధవారం ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.