
విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న వైఎస్ జగన్ అభీష్టం మేరకు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు నిరాడంబరంగా చేసినట్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లను సీఎస్‌కు కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వివరించారు. సీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. కాబోయే సీఎం అభిప్రాయం మేరకు ఏర్పాట్లు నిరాడంబరంగా చేపట్టామని, ప్రజలు దీన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.
సుమారు 30 వేల మంది వరకు స్టేడియంలో ప్రత్యక్షంగా ప్రమాణస్వీకారోత్సవాన్ని చూసేందుకు వీలుందని చెప్పారు. పాస్‌లు లేని వారు కూడా స్టేడియంలోకి వచ్చి చూడవచ్చన్నారు. స్టేడియంలోకి రాలేని వారు నిరుత్సాహ పడవద్దని, స్టేడియం బయట ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, వృద్ధులు, మహిళలు, పిల్లలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. విజయవాడలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
రెండు వేదికలు ఏర్పాటు
ప్రమాణ స్వీకారోత్సవ ప్రధాన వేదికతో పాటు మరో ఉపవేదిక ఏర్పాటు చేసున్నట్లు సీఎస్ చెప్పారు. ప్రధాన వేదికపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎంతో ప్రమాణం చేయిస్తారని.. మరో వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో పాటు ఇతర ప్రధాన అతిథులు ఆసీనులవుతారని సీఎస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment