
కలెక్టర్‌గా ఎం.జానకి
రాజధాని ప్రాంత అభివృద్థి సంస్థ ప్రత్యేక అధికారిగా శ్రీకాంత్ బదిలీ
సాక్షి, నెల్లూరు ప్రతినిధి: జిల్లా కలెక్టర్‌గా ఎం.జానకి నియమితులయ్యారు. ప్రస్తుతం కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్.శ్రీకాంత్‌ను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర పభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జానకి స్వస్థలం తమిళనాడులోని కరూర్ జిల్లా. బీఏ (హిస్టరీ), ఎంఏ (ఆంత్రోపాలజీ) చదివారు. ఈమె 2005 సంవత్సరం బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. జానకి ప్రస్తుతం జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) అడిషనల్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఐఏఎస్‌కు ఎంపికయ్యాక ఈమె తొలిసారిగా మధ్యప్రదేశ్‌లో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనింగ్)గా, భద్రాచలం సబ్ కలెక్టర్‌గా, చిత్తూరు జిల్లా రూరల్ డెవలెప్‌మెంట్ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారిగా, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌గా కమిషనర్‌గా, కృష్ణా జిల్లా డీఆర్‌డీఏ పీడీగా పనిచేసిన అనుభవం ఉంది. ఈమె మాతృభాష తమిళం కాగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు. జానకి భర్త డాక్టర్ నరసింహన్ యువరాజ్ కూడా ఐఏఎస్ అధికారే,. ఈయన ప్రస్తుతం విశాఖపట్నం కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రత్యేకాధికారిగా శ్రీకాంత్
జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్.శ్రీకాంత్ 2013 జూన్‌లో బాధ్యతలు స్వీకరించారు. 18 నెలల పాటు జిల్లాలో తనదైన శైలిలో పరిపాలనను కొనసాగించారు. ముఖ్యంగా సాధారణ ఎన్నికల్లో ఎక్కడా రాజీపడకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా న్యాయబద్ధంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ జరిగేలా కృషి ేశారు. అదేవిధంగా ప్రజా సమస్యలపై వస్తున్న వినతులు పరిష్కారమే లక్ష్యంగా ‘పరిష్కారం’ కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది.
ఇతర జిల్లాల్లో ఈ పథకం గురించి కలెక్టర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. త్వరలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. దీని ద్వారా జిల్లాలో పలు భూ వివాదాలను పరిష్కరించారు. ఇందులో భాగంగా అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులను సైతం కొందరిని తొలగించారు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలో కమిటీల పేరుతో తొలగించిన పింఛన్లను కొన్నింటిని పరిశీలించి తిరిగి అర్హులుగా గుర్తించి పునరుద్ధరించారు.
వసతి గృహాల్లో విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు రాత్రుల్లో అక్కడే బసచేశారు. తద్వారా వసతి గృహాల్లో కొన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అధికారుల బదిలీల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం లేదనే ప్రచారం ఉంది. అందువల్లే జిల్లాలో బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకుంటోందని ఆరోపణలున్నాయి. మొత్తంగా చూస్తే కలెక్టర్ శ్రీకాంత్ వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు.