మదనపల్లె ‘దేశం’లో కమలం గుబులు
- ఎమ్మెల్యే స్థానం బీజేపీకి కేటాయిస్తారని అనుమానం
- కంటితుడుపుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నేతలు
సాక్షి, తిరుపతి: మదనపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు డీలా పడ్డారు. సీట్ల సర్దుబాట్లలో ఈ స్థానం బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం వీరిని ఆందోళనకు గురి చేస్తోంది. బీజేపీ తర ఫున భారతీయ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి చల్లపల్లె నరసింహా రెడ్డికి మదనపల్లె టికెట్టు ఖాయమని దేశం వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ నాయకులు కూడా అంతర్గత సంభాషణల్లో దీనిని అంగీకరిస్తున్నా రు. ఆ పార్టీ జాతీయ స్థాయి అగ్రనేతల్లో ఒకరైన ఎల్‌కే అద్వానీతో చల్లపల్లెకు మంచి అనుబంధం ఉంది.
దీంతో సీట్ల సర్దుబాటు అంటూ జరిగితే చల్లపల్లెకు మదనపల్లె కేటాయించడం ఖాయమని అంటున్నారు. దీనికి తోడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మదనపల్లె విషయంపై మౌనంగా ఉన్నారు. బీజేపీకి కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నందునే మదనపల్లె ప్రస్తావన తేవడం లేదనే అనుమానాలు దేశం నేతల్లో ఉన్నాయి.
ఈ పరిణామాలు ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో టికెట్టు ఆశించిన పలువురు టీడీపీ నాయకులు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కంటితుడుపుగా పాల్గొంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ బీ-ఫాంతో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు ఇప్పుడు లబోదిబోమనే పరిస్థితి నెలకొంది. పార్టీ తర ఫున అనవసరంగా పోటీ చేయాల్సి వచ్చిందనే భావన కొందరు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇష్టం లేకున్నా బలవంతంగా బరిలోకి తెచ్చిన నాయకులు ఇప్పుడు చేతులెత్తేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.
ముందుగానే విషయం తెలిసుంటే టీడీపీ తరఫున పోటీ చేసే వాళ్లం కాదని, తమను రంగంలోకి తెచ్చి బలిపశువులను చేస్తున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆందోళనను బయటకు కక్కలేక మింగలేక ప్రచారంలో పాల్గొంటున్నారు. రాటకొండ మధుబాబు, ఆర్‌జే వెంకటేష్ తదితరులు ఎన్నికల ప్రచారానికి మొక్కుబడిగా హాజరవుతున్నారు. రాందాస్‌చౌదరి, బోడెపాటి శ్రీనివాస్, మరికొందరు నాయకులు పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ తీవ్రమైన వైరాగ్యంలో ఉన్నట్టు దేశం వర్గాలు చెబుతున్నాయి.
మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన నేడో రేపో మదనపల్లెకు వచ్చినప్పటికీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేది సందేహమే. మొత్తానికి టీడీపీ నేతల్లో ఉన్న అసంతృప్తి మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది.