లోడు దించండ్రా..!
- ఓటమి భయంతో భారీ ఎత్తున టీడీపీ ప్రలోభాలు
- నగదు, మద్యం,సైకిళ్లు,చీరలు సిద్ధం
- ఓటుకు వెయ్యి వంతున పంపిణీ
సాక్షి,విశాఖపట్నం : టీడీపీ ఎన్నికల ముందు బరితెగిస్తోంది. కోట్లకు కోట్లు నియోజకవర్గాల్లో గుమ్మరిస్తోంది. పోలింగ్‌కు ఇంకా రెండురోజులే సమ యం ఉండడంతో రహస్యంగా దాచిన నగదు,మద్యం, ఇతర తాయిలాలను బయటకు తీస్తోంది. ఓటకు రూ.వెయ్యిచొప్పున పంపకాలు చేస్తోంది. అనుచరులు, నేతలతో మద్యం పంపిణీచేయించి పూటుగా ఓటర్లను తాగిస్తోంది.
ప్రజాభిమానంతో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీని ఢీకొనడం టీడీపీకి సాధ్యపడడంలేదు. పార్టీ అభ్యర్థులు ప్రచారంలో నీరసపడిపోవడం, ప్రజలు పార్టీని పట్టించుకోకపోవడంతో ఒక్కో నియోజకవర్గంలో రూ.10కోట్లకుపైగా ఖర్చుచేసి ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. అనకాపల్లిలో పీలా గోవింద్ వర్గం ఈ విషయంలో మరింత జోరుమీదుంది. ఇక్కడ ఇప్పటికే రూ.5 కోట్లకుపైగా ప్రలోభాలకే వెచ్చించినట్లు సమాచారం.
ఇటీవల పట్టణంలోని ఓ లాడ్జిలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఓటుకు రూ.500నుంచి రూ.1,000 పంచుతున్నారు. నరీపట్నం లో అయ్యన్నపాత్రుడికీ ఓటమి భయంతో చెమటలు పడుతున్నాయి. దీంతో కొన్నిరోజులుగా మద్యం విపరీతంగా సరఫరా చేయిస్తున్నారు. రూ.1 కోటి ఖర్చుపెట్టి సైకిళ్లు, నగదు,చీరలు పంపిణీచేసినట్లు పార్టీ క్యాడరే చెబుతోంది. రాత్రి పదిదాటితే అనుచరులతో నగదు,మద్యం పంపిణీ చేయిస్తున్నారు.
మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో అభ్యర్థుల గవిరెడ్డి రామానాయుడు, రాజులదీ ఇదే పరిస్థితి. ఇక్కడ ఇప్పటికే ఓటుకు రూ.500చొప్పున మొత్తం రూ.7కోట్లు పంచినట్లు సమాచారం. పాయకరావుపేటలో అనితకు అసమ్మతి సెగ తీవ్రంగా తాకుతోంది. వీరిని దారికితెచ్చుకునేందుకు మద్యం, డబ్బునే నమ్ముకున్నారు. గతరెండురోజులుగా నియోజకవర్గంలో ఓటర్లను వర్గాలుగా విభజించి డబ్బు, చీరలు,వెండి పట్టీలు పంచుతున్నారు.
పెందుర్తిలో బండారు పరిస్థితి దయనీయంగా ఉంది. కబ్జాల ఆరోపణలు వెల్లువెత్తడంతోబాటు, క్యాడర్ దూరంగా ఉండడంతో ఓటమి అంచుల్లో ఉన్న ఈయన నియోజకవర్గం పరవాడ,పెందుర్తిల్లో ఓటుకు రూ.500నుంచి రూ.800వరకు పంచుతున్నారు. శనివారం రాత్రి నుంచి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఈ మేరకు ఓటర్లకు పంచడానికి పార్టీ అధిష్టానం నియోకవర్గానికి రూ.2 నుంచి రూ.4కోట్ల వరకు పంపినట్లు తెలుస్తోంది.
రూ.లక్షతో టీడీపీ నాయకుడు అరెస్టు
చింతపల్లి: ఓటర్లకు పంపిణీకి సిద్ధం చేసిన రూ.లక్షతో టీడీపీ నాయకుడ్ని చింతపల్లి ఎస్‌ఐ తారకేశ్వరరావు ఆదివారం పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని ప్రచారవాహనాన్ని సీజ్ చేశారు. టీడీపీ మండల ప్రచార కార్యదర్శి కొట్టిగుళ్ల సుబ్బారావు ప్రచార వాహనంలో రూ.లక్షను దారకొండ ప్రాంతంలో ఓటర్లకు పంపిణీకి తీసుకువెళుతుండగా సమాచారం మేరకు అంతర్ల వద్ద వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. రూ.లక్ష నగదు దొరికింది. దానిని స్వాధీనం చేసుకుని సుబ్బారావుతోపాటు డ్రైవర్ కిముడు సూర్యప్రకాష్‌ను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.