టీడీపీ డొల్ల.. నాయకులకు వల
- గ్రామస్థారుు నేతలకు వెల కడుతున్న పచ్చపార్టీ
- డ్వాక్రా గ్రూపులకూ నోట్ల ఎర
- ఓట్ల కోసం నీచ రాజకీయాలు
సాక్షి, ఏలూరు: గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి నేతల వరకూ ప్రతి ఒక్కరినీ ప్రలోభాలకు గురి చేయడం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఓటర్లు తమను పట్టించుకోకపోవడంతో బేజారెత్తిపోతున్న ఆ పార్టీ అభ్యర్థులు గ్రామీణ నేతలకు వెలకడుతున్నారు. నాయకుడి స్థాయిని బట్టి రేటు నిర్ణయించి మరీ సాగిస్తున్న కొనుగోళ్ల పర్వం ప్రజాస్వామ్య వ్యవస్థపై టీడీపీకి గల గౌరవానికి నిదర్శనంగా కనిపిస్తోంది. పచ్చ పార్టీ నీచ రాజకీయాలను, ఆ పార్టీకి అమ్ముడుపోతున్న నాయకులను జనం అసహ్యించుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం రోజురోజుకు అధికమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఓ వైపు రౌడీయిజం చేస్తూనే.. తమకు అనుకూలంగా లేని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
మరోవైపు సొమ్ములు వెదజల్లి ఓట్లు కొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇది చాలదన్నట్టు ద్వితీయ శ్రేణి నాయకులకు గాలమేస్తున్నారు. గరిష్టంగా ఒక్కొక్క నాయకుడికి రూ.2 లక్షల వరకూ చెల్లించి తమవైపు తిప్పుకుంటున్నారు. అలా వచ్చిన వారితో పోలింగ్ బూత్‌స్థాయి కమిటీలు వేస్తున్నారు. ఆ కమిటీలు తమ ప్రాంతంలోని వారికి రోజంతా తాగినంత మద్యం, ఉదయం అల్పాహారం దగ్గర్నుంచి రాత్రి భోజనం వరకూ తిన్నంత తిండి వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం డబ్బు, మద్యం, బిర్యానీతోనే ఓట్లు రాలతాయనే పిచ్చి భ్రమలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
ముందే మొదలు
పోలింగ్ ముందురోజు రాత్రి డబ్బులు పంచడం అనేది గతం నుంచీ వస్తున్న ఆనవాయితీ. ఈ ఎన్నికల్లో ఆ సంప్రదాయాన్ని కొంచెం సడలించారు. అధికారుల నిఘా ఎక్కువగా ఉండటంతో పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లో నాలుగు రోజులు ముందునుంచే పంపిణీలు ప్రారంభించారు. సాధారణ ఎన్నికల విషయానికి వచ్చేసరికి పది రోజులు ముందుగానే ప్రలోభాలకు తెరతీశారు. తొలివిడతగా డ్వాక్రా మహిళలకు టీడీపీ నేతలు సొమ్ములు ఆశ చూపిస్తున్నారు. పార్టీ కార్యక్రమానికంటూ పిలిపించి గ్రూపునకు ఇంత అంటూ సొమ్ము ముట్టజెబుతోంది. రెండురోజుల క్రితం ఏలూరు నియోజకవర్గంలో ఈ తంతు నడిచింది. ఇతర నియోజకవర్గాల్లోనూ ఇదే తరహాలో ప్రలోభాలు నడుస్తున్నారుు. వీటిని అదుపు చేయడానికి అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా టీడీపీ అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అయి తే, చక్రాలూడిన ‘సైకిల్’ ఎంత ప్రయత్నించినా ముందుకు కదలదని, తాత్కాలిక ప్రలోభాల కంటే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే నేతకే ఓటేస్తామని జనం చెబుతున్నారు.