చిత్తూరు టీడీపీలో సెగ
- అసంతృప్తితో దూరమవుతున్న ఓ వర్గం
- గంగనపల్లెలో కార్యాలయం మూసివేత
- తోటపాళెం కార్యాలయం స్థానంలో వైఎస్సార్ సీపీ ఆఫీసు
సాక్షి, తిరుపతి: జిల్లా కేంద్రమైన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా కొట్టేయాలని తెలుగుదేశం పార్టీ రచిం చిన వ్యూహం బెడిసికొట్టిం ది. టీడీపీకి ఇప్పటివరకు వెన్నుదన్నుగా ఉంటున్న బలిజ సామాజికవర్గం లోని ఒక బలమైన వర్గం దూరమవుతోంది. టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభ సమీపబంధువు డీకే బద్రినారాయణ పోకడలు నచ్చకపోవడం తో ఆ సామాజికవర్గం ముఖ్యులు ఎన్నికల్లో ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ కౌన్సిలర్ కఠారి మోహన్ సతీమణి అనురాధ వర్గీయులు బద్రి వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతానికి కఠారి మోహన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నా ఆయన వర్గీయులు మాత్రం దూరమయ్యా రు. అందులో భాగంగానే గంగనపల్లెలో పార్టీ కార్యాలయూన్ని రెండు రోజులుగా మూసేశారు. తోటపాళెంలో ఆ పార్టీ కార్యాలయం స్థానం లో వైఎస్సార్ సీపీ కార్యాలయం వెలసింది.
నామినేషన్ల స్వీకరణకు కొద్దిరోజుల ముందు సత్యప్రభను తెలుగుదేశం రంగంలోకి తెచ్చింది. సామాజికవర్గపరంగాను, ఆర్థికంగాను ఆమె బలమైన శక్తిగా చంద్రబాబు భావించారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా సత్యప్రభకు టికెట్టు ఇచ్చే విషయంలో అభ్యంతరం చెప్పకపోవడంతో ఆమెను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆ తరువాత డివిజన్లవారీగా పార్టీ కార్యాలయాల ఏర్పాటులో రెండు ప్రధాన సామాజికవర్గాల నేతల మధ్య విభేదాలు పొడసూపాయి.
గత నెలలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయా డివిజన్ల నుంచి పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులకు డివిజన్ బాధ్యతలు అప్పగించాలని తొలుత భావించారు. ఇది కొందరికి నచ్చలేదు. ఆయా డివిజన్లలో బలమైన నాయకులకు బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు ఆ పార్టీ నానా ఇబ్బందులు ఎదుర్కొంది. తాజాగా ఇప్పుడు సత్యప్రభ కుటుం బానికి సన్నిహితంగా ఉంటున్న బలిజ సామాజికవర్గానికి చెందిన నేతలు దూరమయ్యారు.
ఈ వర్గానికి నాయకత్వం వహిస్తున్న కఠారి మోహన్ పైకి కనిపించ కపోయినా అంతర్గతంగా బద్రి వ్యవహారశైలిపై కుతకుతలాడుతున్నట్టు సమాచారం. ఆయన వర్గానికి చెందిన ప్రముఖులు ఇప్పటికే ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకున్నారు. ఇది చిత్తూరు లో టీడీపీకి పెద్ద షాక్ అని చెప్పకతప్పదు. అంతేకాకుండా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నాయకులు కూడా కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారు.
తాము గట్టిగా పట్టుబట్టి చంద్రబాబును ఒప్పించి సత్యప్రభకు టికెట్టు ఇప్పిస్తే తమను చిన్నచూపు చూస్తున్నారనే భావన కొంతమంది కమ్మ సామాజికవర్గ నేతల్లో ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో బద్రి సొంత మనుషులకే పరిమితమవుతున్నారని అంటున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థికి ఇటు సొంత సామాజికవర్గంతో పాటు కమ్మ సామాజికవర్గం నుంచి కూడా అసంతృప్తులు పెరగడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
డబ్బులు ఇవ్వలేదని క్యూ కట్టిన నిర్వాహకులు
పార్టీ కార్యాలయాల నిర్వహణకు రోజువారీ డబ్బులు ఇవ్వలేదని శనివారం సాయంత్రం ఐదారు డివిజన్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా నేరుగా డీకే బద్రినారాయణ వద్ద అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే రకంగా వ్యవహరిస్తే కార్యాలయాలు మూసివేస్తామన్నా రు. దీంతో వారికి అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి పంపినట్టు తెలిసింది. ఒక్కో కార్యాలయానికి రూ.10 వేలు వంతున చెల్లిస్తున్నట్టు సమాచారం.