వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే సత్తా లేదాయె
టీడీపీ సమావేశంలో భగ్గుమన్న అసంతృప్తి
నేతలు సహకరించడం లేదన్న ఎమ్మెల్యే
అభివృద్ధి చేయలేకపోతున్నానంటూ కన్నీళ్లు
తిరుపతి టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో నివురుగప్పిన నిప్పులా పెరిగిన అసంతృప్తి సోమవారం బహిర్గతమైంది. పార్టీ కార్యకర్తలు, డివిజన్ స్థాయి నాయకులు తమలోని అసంతృప్తిని మూకుమ్మడిగా వెళ్లగక్కారు. ఇలాగైతే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవడం కష్టమని స్పష్టం చేశారు. రెండేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేకుండా పోయిందనీ, ఇప్పటికీ జనం వైఎస్సార్ పేరునే జపిస్తున్నారని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో శాసనసభ్యురాలు సుగణమ్మ ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో పార్టీ కేడర్ విస్మయానికి లోనైంది.
తిరుపతి సిటీ: తిరుపతిలోని ఓ ప్రయివేటు హోటల్ సోమవారం సాయంత్రం టీడీపీ నగర కమిటీ అధ్యక్షుడు దంపూరి భాస్కరయాదవ్ అధ్యక్షతన ఆ పార్టీ నగర కమిటీ, అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. ముందుగా పార్టీ కేడర్ తమ అభిప్రాయాలు పార్టీ నేతల ముందు వెలిబుచ్చారు. ‘టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పైబడినా ఇంతవరకు పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగటంలేదు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే సత్తా మనకు లేదని తెలుగుయువత జిల్లా కార్యదర్శి కంకణాల రజనీకాంత్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కాలనీల్లోకి వెళ్లి పింఛన్ల గురించి ఆరా తీసినా వైఎస్ పుణ్యంతోనే తీసుకుంటున్నామని చెబుతున్నారని టీడీపీ జిల్లా కార్యదర్శి కుమారమ్మ చెప్పుకొచ్చారు. దీనినిబట్టి మనం ఏవిధంగా ఉన్నామో అర్థమవుతోందని చెప్పారు. తిరుపతిలో వైఎస్సార్‌సీపీకి బలమైన పార్టీ క్యాడర్ ఉందని, ఇప్పటికే బలమైన అభ్యర్థులను ప్రకటించి డివిజన్లలో పర్యటిస్తున్నారని కొందరు చెప్పారు. కార్పోరేషన్ ఎన్నికలలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. నామినేటెడ్, పార్టీ పదవులు ఇవ్వకపోవటం వల్ల చాలా మంది అసంతప్తిగా ఉన్నారన్నారు.
ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ తిరుపతిలో కార్యకర్తలకు రెండేళ్లుగా ఏమీ చేయలేకపోతున్నానని కన్నీటీ పర్యవంతమయ్యారు. జిల్లాలో మంత్రులుగానీ, పార్టీలోని సీనియర్ నేతలుగానీ సహకరించడంలేదని వాపోయారు. పార్టీ కార్యకర్తలకు, వార్డుల్లోని ప్రజలకు ఏమీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో కష్టమే...
Published Tue, Jul 12 2016 1:51 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement